●
●ఒక క్యాన్సర్ పేషెంటు డోసిటాక్సిల్ అనే ఇంజక్షన్ కొనుక్కుంటే బ్రాండెడ్ ధర రూ.80 వేలు, అదే జనరిక్ మందు అయితే రూ.8వేలే.
●రోజూ వాడే యాంటీబయోటిక్స్ మందుల్లో కూడా అంతే. సిఫిగ్జిమ్ 200 ఎంజీ యాంటీబయోటిక్ బ్రాండెడ్‌లో కొంటే రూ.1250, అదే జనరిక్‌లో రూ.450 మాత్రమే.
కమీషన్లకు ఆశపడుతున్న డాక్టర్ల వల్ల పేద రోగులు నష్టపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బ్రాండెడ్ మందుల కొనుగోలుతో రోగులు భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తోంది. బ్రాండెడ్ మందులు, జనరిక్ మందులకూ చికిత్సపరంగా తేడా ఉండదు. కానీ రోగం తగ్గాలంటే బ్రాండెడ్ మందులే పనిచేస్తాయని కొంతమంది డాక్టర్లు చెబుతుండటంతో రోగులు నమ్ముతున్నారు. దీంతో భారమైనా బ్రాండెడ్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఓవైపు నేషనల్ మెడికల్ కమిషన్ జనరిక్ మందులను ప్రోత్సహించాలని, రోగులకు వ్యయ భారం తగ్గించాలని, డాక్టర్లు చీటీలు కూడా ఇంగ్లిష్ కేపిటల్ లెటర్స్‌లో అందరికీ అర్థమయ్యేలా రాయాలని సూచిస్తున్నా ప్రైవేట్ డాక్టర్లు బ్రాండెడ్ మందులనే సిఫార్సు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2,200 మెడికల్ స్టోర్లు ఉండగా.. ఎక్కువగా బ్రాండెడ్ మందులే అమ్ముడుపోతున్నాయి.
బ్రాండెడ్‌కూ..జనరిక్‌కూ తేడా ఏమిటి?
బ్రాండెడ్ అంటే ఒక కంపెనీ కొత్త మందును కనుక్కుని దానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు తమ కంపెనీ పేరు మీద బ్రాండెడ్ మెడిసిన్‌గా ముద్ర వేసుకుంటారు. ఈ మందుపై ఆ కంపెనీకి 10 సంవత్సరాల పేటెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ మందును అదే ఫార్ములాతో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. దీన్నే జనరిక్ మందులు అంటారు. బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు కాబట్టి తయారీ వ్యయం తక్కువ. డ్రగ్స్ కాంబినేషన్ అదే ఉంటుంది. తయారీలోనూ తేడా ఉండదు. ధరలో మాత్రం భారీ తేడా ఉంటుంది.