
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో రౌడీషీటర్లపై మళ్లీ నిఘా పెడుతున్నారు. వారం రోజుల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు ఏడాదిలో సాధారణ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని పోలీసు వర్గాలు నిర్ణయించాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ గొడవలు సృష్టించే అవకాశం ఉంటుందన్న అనుమానంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, జిల్లాలో 45 ప్రాంతాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా చోట్ల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
2 వేలకు పైగా రౌడీషీట్లు..
జిల్లాలో గత కొన్నేళ్లుగా నమోదైన రౌడీషీట్లు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులూ, అంతెందుకూ తమ మాట వినని ఎవరిపైన అయినా ఇట్టే రౌడీ షీట్ ఓపెనయ్యేది. పోలీసులు మాట వినకపోతే వారిపై తెలుగుదేశం పార్టీనేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ రౌడీషీట్ ఓపెన్ చేసేవారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
తాడిపత్రిలో అత్యధికంగా..
జిల్లాలో తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ రౌడీషీట్లు నమోదైఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 759 మందిపై రౌడీషీట్ తెరిచారు. టీడీపీ హయాంలో జేసీ సోదరులు, వారి అనుచరుల ఆగడాలు అందరికీ తెలిసిందే. తాడిపత్రి సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రౌడీషీట్‌ల నమోదు భారీగా తగ్గింది.
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు (ఫైల్)
ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అసాంఘిక శక్తులపై పోలీసుల దృష్టి
రౌడీషీటర్లపై నిఘా
టీడీపీ హయాంలో ప్రత్యర్థులపై భారీగా రౌడీషీట్లు
జిల్లాలోనే అత్యధికంగా
తాడిపత్రి సబ్‌డివిజన్‌లో నమోదు
ప్రత్యర్థులపై కక్షతో ఓపెన్ చేయించిన జేసీ సోదరులు
మట్కా కలెక్షన్ ఇవ్వకపోయినా రౌడీషీట్
2014–19 మధ్య కాలంలో తాడిపత్రి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో వందల రౌడీషీట్‌లు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టినా రౌడీషీట్ నమోదయ్యేదని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అంతెందుకూ మట్కా ఆడేవారిపై రౌడీషీట్ నమోదు చేయించడం, వారం వారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా సిఫార్సు చేసినందుకు కలెక్షన్ ఇవ్వమనడం ఇదీ పరిస్థితి. తమకు నచ్చని వందల మందిపై జేసీ సోదరులు రౌడీషీట్ ఓపెన్ చేసేవారని ఓ నాయకుడు పేర్కొన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరిపైనా రౌడీషీట్ నమోదై ఉందంటే ప్రభాకర్ రెడ్డి సోదరుల వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
రౌడీషీట్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే?
హత్యాహత్నం కేసు నమోదు లేదా హత్య కేసు ఉన్నప్పుడు..శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కేసులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి కేసుల్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నప్పుడు రౌడీషీట్ ఓపెన్ చేసి అతనిపై నిఘా ఉంచుతారు. వారానికోసారి పోలీస్ స్టేషన్ కొచ్చి కనిపించి వెళ్లాల్సి ఉంటుంది.
ఇలా తీసేస్తారు..
ఒక్కసారి రౌడీషీట్ నమోదు చేశారంటే కనీసం రెండేళ్లు పరిశీలనలో ఉంచుతారు. ఆ రెండేళ్లలో అతనిపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా, సత్ప్రవర్తన వచ్చిందని రుజువైతే రౌడీషీట్ క్లోజ్ చేస్తారు. ఏడాదికోసారి రౌడీషీటర్లపై సమీక్ష జరుగుతుంది. అతనిలో మార్పు వచ్చిందని ఎస్‌డీపీఓ (సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్) సర్టిఫికెట్ ఇస్తే రౌడీషీట్ మూసేస్తారు.