రాంబిల్లి: పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఫణిగిరి ప్రదక్షిణంతో ఆధ్యాత్మిక సందడి చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం ఫణిగిరి ప్రదక్షిణ అత్యంత ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో సాగింది. తొలుత ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో పాటు భక్తజనం ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అఖండ జ్యోతి వెలిగించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడకపాలెం, చెర్లోపాలెం, మల్లవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి, పూడి పునరావాసకాలనీ, గొర్లె ధర్మవరం , వెంకటాపురం జంక్షన్, ధార భోగాపురం, అప్పారాయుడుపాలెం, ధారపాలెం మీదుగా పంచదార్ల పుణ్యక్షేత్రం చేరడంతో ఫణిగిరి ప్రదక్షిణ ముగిసింది. ఓం నమశ్శివాయ..హర హర మహాదేవ శంభోశంకర నామస్మరణ చేసుకుంటూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. పలు గ్రామాల్లో దాతలు పండ్లు, పాలు, తాగునీరు, మజ్జిగ, ఇడ్లీ, పులిహోర, బిస్కెట్లు వంటి ఆహార పదార్ధాలను ఉచితంగా అందజేసారు. పలుచోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 31 కిలో మీటర్ల పొడవునా ఫణిగిరి ప్రదక్షిణ సాగింది. దారి పొడవునా భజనలు, కోలాటాలు చేసి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చారు. ప్రదక్షిణ చేసిన భక్తులు ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామి వారి రథంలో ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. గిరి ప్రదక్షిణ పొడవునా ఆయా గ్రామాల భక్తులు ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించున్నారు.
ఉమా ధర్మలింగేశ్వరస్వామికి పూజలు
ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ తరలివచ్చిన వేలాది భక్తులు
పలుచోట్ల తాగునీరు ఆహార పదార్థాలు పంపిణీ ఆకట్టుకున్న కోలాటాలు, భజనలు


