తొలి విడత పంచాయతీప్రచారానికి తెర | - | Sakshi
Sakshi News home page

తొలి విడత పంచాయతీప్రచారానికి తెర

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

రేపే తొలివిడత ఎన్నికలు జిల్లాలోని 8 మండలాల్లో పంచాయతీ

గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు

సాక్షి, అనకాపల్లి: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరుకు అంత సన్నద్ధం అవుతున్నారు.ఈ నెల 26న తొలి విడత పోరు జరనుంది. ఈ నెల 21న అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు జరిగిన తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులంతా విజయం కోసం ప్రచారం చేసుకున్నారు. షెడ్యూల్‌పై ముందస్తుగా అవగాహన ఉన్నప్పటికీ గుర్తుల కేటాయింపు తర్వాతనే ప్రచారంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండడంతో మూడు రోజుల పాటు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం నుంచి మైకులు మూగబోయాయి. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటును పొందేందుకు ఆయా అభ్యర్థులు అవకాశం ఉన్నంత మేరకు తాయిలాలు అందించే పనిని వారి అనుచరుల ద్వారా మొదలుపెట్టారు.

పోటీలో 3,619 మంది...

తొలి విడతలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి మండలంలోని (30 పంచాయతీలకు,రెండు పంచాయితీలకు కోర్టు కేసుల కారణంగా మూడవ విడతలో నిర్వహిస్తున్నారు), కశింకోట,చోడవరం, బుచ్చియ్యపేట,రావికమతం, రోలుగుంట, పరవాడ మండలాల్లో గల 217 పంచాయతీల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. వీటిలో 31 సర్పంచ్‌ స్థానాలకు ఏకగ్రీవం అవ్వడంతో పోటీలో 184 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు 502 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. అదే విధంగా 1,959 వార్డు స్థానాలకు 455 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,732 పంచాయతీ వార్డు స్థానాలకు గానూ, 3,117 మంది బరిలో నిలిచారు. సర్పంచ్‌, వార్డు స్థానాలకు గానూ 3,619 మంది గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీలకు పంచా యతీ ఎన్నికలు ప్రతిష్టాత్మం అయినప్పటికీ రాజకీయ పార్టీ గుర్తులు లేకపోవడంతో ఆయా రిటర్నింగ్‌ అధికారులు కేటాయించిన గుర్తుల మేరకు ఎన్నికల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదే రోజు లెక్కింపు...

అనకాపల్లి జిల్లాలోని 217 పంచాయతీల్లో జరగాల్సిన తొలి విడత పోరులో భాగంగా ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించిన పోలింగ్‌ కేంద్రాల వద్దే కౌంటింగ్‌ జరపనున్నారు.గ్రామ స్థాయి ఎన్నికలు కావడంతో కౌంటింగ్‌ కేంద్రాల తీవ్ర ఉత్కంఠ ఎదురయ్యే అవకాశాలు ఉన్నారు.

రెండవ విడతకు కీలకం...

రెండవ విడతలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం కీలకమైన రోజుగా మారింది.ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పాటు గుర్తుల కేటాయింపు జరిగింది.ఈ కారణంగా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయి.తుది పోరులో నిలిచిన అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తుల మేరకు ఈ నెల 27 వరకూ ప్రచారం చేసుకునే అవకాశం మాత్రమే ఉండడంతో గుర్తుల ఖరారు జరిగిన వెంటనే ప్రచార సామగ్రి తయారు చేసుకునేందుకు పరుగులు తీశారు. రెండో విడతలో 213 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.అదే విధంగా మూడవ విడతలో నిర్వహించే 214 పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది.

స్థానాలకు బరిలో 502, వార్డు స్థానాలకు 3,117 మంది అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement