అనకాపల్లి టౌన్: మండలంలోని సత్యనారాయణపురం హేమగిరి సత్యనారాయణపురం ఆలయం వద్ద నిర్వహించిన గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు కొండ దిగువన ఉన్న ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. వివిధ సాంస్కృత్రిక కార్యక్రమాలతో డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సత్యనారాయణ పురం ఆర్చి నుంచి స్వామి వారి రథం ప్రారంభమైంది. సుమారు ఐదు కిలోమీటర్ల పాటు సాగిన ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేశారు.


