పర్యాటకపచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకపచ్చపాతం

Nov 24 2026 12:48 AM | Updated on Nov 24 2026 12:48 AM

ఆవకు ఆవల ఒక రకం...ఈవల జగడం

సాక్షి, అనకాపల్లి: సహజ సౌందర్యాల సొంతం వాడ్రాపల్లి–కొండకర్ల ఆవ(చిన్న పాటి సరస్సు). ఏపీలోని కొల్లేరు, పులికాట్‌ తరహాలోనే ఉన్న చిన్న పాటి సరస్సుకు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పర్యాటక ప్రాంతంగా ఆవకు రెండు వైపులా ఉన్న మునగపాక మండలంలోని(వాడ్రాపల్లి),అచ్యుతాపురం మండలంలోని (కొండకర్ల) మధ్య పక్షపాతం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఏంటా కథ..? వివరాల్లోకి వెళితే...

ఆవకు ఆవల అలా..

జిల్లాలోని రెండు మండలాల సరిహద్దులో ఉన్న వాడ్రాపల్లి–కొండకర్ల ఆవకు విస్తీర్ణం రెండు వేల ఎకరాలకు పైబడి ఉంటుంది. నాలుగు కొండలు,తొమ్మిది గ్రామాల సరిహద్దులో ఉన్న ఈ ఆవ అభివృద్ధి విషయంలో ఇప్పుడు వ్యత్యాసం చూపించడం వెలుగులోకి వచ్చింది. కొండకర్లకు ఆనుకొని ఉన్న ఆవ వద్ద బోట్లపై ఎక్కి వాడ్రాపల్లి వరకూ వచ్చి తిరిగి వెళతారు. ఆవలో ఉన్న కలువ పూల అందాలు,తామర పూల సోయగాలు, చుట్టుపక్కల కొండల సౌందర్యం, నీలి రంగులో తేలియాడే నీరు, మత్స్య సంపద అనేక మందికి ఉపాధిని ఇస్తుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కొండకర్ల, వాడ్రాపల్లికి ఒక్కో ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ సాంకేతిక అవరోధాలు తెరమీదకు తెచ్చి వాడ్రాపల్లిలో పర్యాటక అభివృద్ధికి పచ్చపాతం మొదలయ్యింది. మునగపాక మండలంలో చక్రం తిప్పుతున్న ఒక మండల స్థాయి కూటమి నేత, తాజాగా వాడ్రాపల్లి సర్పంచ్‌ బరిలో ఉన్న ఒక అభ్యర్థే వాడ్రాపల్లిలో పర్యాటక అభివృద్ధికి ఆటంకంగా మారడంతో ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమైంది.

వాడ్రాపల్లికో రూలు...

అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల ఆవ గట్టుకు ఆనుకొని 10కి పైగా రిసార్టులు వెలిశాయి. ఆయా రిసార్టుల్లో స్విమ్మింగ్‌ పూల్‌లు, వారంతంలో మితిమీరిన వినోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడి రిసార్టులతో పాటు, భవనాలు(అసెస్‌మెంట్లు) 1159 వరకూ ఉన్నాయి. వీటిలో కమర్షియల్‌ కోటాలోకి వచ్చే రిసార్టుల యజమానులకు ఎన్నికల ముందు కొండకర్ల కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఆయా రిసార్టులకు ఉన్న అనుమతులు, చెల్లిస్తున్న ఆస్తి పన్నుల వివరాలు తెలపని సదరు నోటీసులో సారాంశం. అయితే సదరు నోటీసులకు ఆశించిన సమాధానాలు రాలేదు.అంతే కాకుండా కొండకర్ల గ్రామం నుంచి ఆవకు వెళ్లే దారికి 30 అడుగుల లోపే ర హదారి సౌకర్యం ఉన్నప్పటికీ వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు వచ్చినా, రాకపోయినా,ల్యాండ్‌ కన్వర్షన్‌పై స్పష్టత ఉన్నా లేకున్నా యథేచ్ఛగా రిసార్టుల నిర్వహణ .జోరుగా సాగిపోతుంది. ఇక్కడి రాని అడ్డంకులు మునగపాక మండలంలోని వాడ్రాపల్లికి వచ్చాయి.దశాబ్ధం క్రితం వాడ్రాపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావించిన అప్పటి స్థానిక ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌, పర్యాటక శాఖ అధికారుల సమక్షంలో విడిది కేంద్రాలను సైతం ఏర్పాటు చేయించారు. తాజాగా ఇక్కడ రిసార్టుల తరహాలో గెస్ట్‌ హౌస్‌లు నిర్మించేందుకు ఉపక్రమించిన ఔత్సాహికులు వీఎంఆర్‌డీఏ నిబంధనల ప్రకారం 30 అడుగుల రహదారి ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. తద్వారా రిసార్టుల తరహాలో నిర్మాణం చేపట్టాలని భావించిన ఔత్సాహికులకు అనుమతి నిరాకరించారు. వాడ్రాపల్లిలో 725 వరకూ అసెస్‌మెంట్లు ఉన్నప్పటికీ వేటికి అనుమతులు ఉన్నాయో అధికారిక లెక్కలు లేవు. అనుమతులు లేని ఇళ్లు నిర్మించుకోవచ్చు గానీ, అనుమతులు కోరిన రిసార్టులకు అనుమతులు ఇక్కడ ఇవ్వబడవని అధికారులు పేర్కొనడం గమనార్హం.

● భవనం కట్టాలంటే వీఎంఆర్‌డీఏ అనుమతి ఉండాలని వాడ్రాపల్లిలో ఆంక్షలు

● కొండకర్లలో ఇష్టారాజ్యంగా రిసార్టుల నిర్మాణాలు

● సందర్శనీయ క్షేత్రాలున్న వాడ్రాపల్లిలో పర్యాటక అభివృద్ధికి సొంత గ్రామ నేతల అడ్డంకి

● కొండకర్లలో ఎకో టూరిజానికి తూట్లు

● కొండకర్లలోని ప్రైవేట్‌ రిసార్టులకు నష్టం కలగకుండా అఽధికారుల సాయం..!

పోటీలో ఉన్న అభ్యర్థే అడ్డంకి..?

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యింది. వాడ్రాపల్లికి దక్షిణ కాశీవిశ్వేశ్వర ఆలయం,కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆవ నీటిలో ఉండే శివలింగం,అప్పట్లో తాటి దోనెల్లో విహారం,ఇప్పుడు బోట్లపై పర్యాటకుల షికారు, సినీ షూటింగ్‌ల సందడి,లెక్కలేనన్ని ఇతర షూటింగ్‌లు జరిపే పర్యాటక ప్రియులకు ఇక్కడ సేద తీరే అవకాశం లేదు. రిసార్టు నిర్మాణానికి గత ఏడాది ఉపక్రమించిన ఔత్సాహికుడికి స్థానికంగా ఉండే ఒక అధికారి ఇచ్చిన సలహా ఏంటంటే..?‘ తమరు ఈ గ్రామానికి చెందిన ఒక నేత వద్దకు వెళ్లి ఓ.కే చేయించుకోండి..అప్పుడు అనుమతి ఇస్తాం ’అని అనధికార సూచన.సదరు అనుమతి నిరాకరించిన కూటమి నేతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. సొంత గ్రామ పర్యాటక అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన కూటమి నేత ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అదే గ్రామానికి ప్రతినిధిగా గెలవాలని ఓటు అడుగుతున్నారనే ప్రశ్న తలెత్తింది. వాడ్రాపల్లికి చెందిన కూటమి నేతకు మండల స్థాయిలో ఉన్న కూటమి నేత సహకారం ఉండటం వాడ్రాపల్లిలో రిసార్టుల నిర్వహణ పెరిగితే కొండకర్లలో రిసార్టులకు అన్యాయం జరుగుతుందనే అనుమానంతో సొంత గ్రామానికి,సొంత మండలానికి అన్యాయం చేస్తున్న కూటమి నేతల భాగోతంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కొండకర్లలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొండకర్లలో ఎన్నో దశాబ్ధాల క్రితం నిర్మించిన ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ ఇప్పుడు తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉంది. ఆ నిర్మాణం కూడా సాంకేతిక కారణాల చూపి మొదలు పెట్టలేదు.అంతే కాకుండా వాడ్రాపల్లి–కొండకర్ల ఆవలో సందడి చేసే విదేశీ పక్షులు రాత్రి వేళ బస చేసే ప్రాంతంగా గుర్తింపు ఉన్న అందలాపల్లి కొండపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీకి అనుమతి ఇచ్చి అధికారులు ఎకో టూరిజాన్ని బలిచేశారు.ఇలా రెండు వైపులా నిబంధనల ఉల్లంఘన చేస్తూ పచ్చపాతం చూపిస్తున్న కూటమి నేతలు,అధికారులు వాడ్రాపల్లి విషయంలో ఒకలా,కొండకర్ల విషయంలో మరోలా వ్యవహరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement