సిబ్బందికి శిక్షణ సమావేశంలో కలెక్టర్ సూచనలు
తుమ్మపాల: జనగణన ప్రక్రియ అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ఎటువంటి తప్పులకు తావులేకుండా అధికారులు అత్యంత కచ్చితత్వంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన రెండవ రోజు సమావేశంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పలు అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో సేకరించే వివరాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ డాక్టర్ జగన్నాథపురి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జనగణన విధి విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, డిజిటల్ యాప్ వినియోగం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్వోలు, ఇతర ఛార్జ్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


