అనకాపల్లి: జిల్లాలోని 8 మండలాల్లో ఫేజ్–1 గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఫేజ్–1 పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవమైన పంచాయతీలు పోయి, మొత్తం 8 మండలాల్లోని 353 పోలింగ్ లొకేషన్లలో 71 అతి సమస్యాత్మక, 108 సమస్యాత్మక, 174 సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 5, ఇతర అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 3, సమస్యాత్మక ప్రాంతాల్లో 2, సాధారణ ప్రాంతాల్లో ఒక పోలీస్ సిబ్బందితో స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 95 రూట్ మొబైల్ బృందాలతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి కనీసం 3 స్ట్రైకింగ్ ఫోర్సులు (సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో), ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (డీఎస్పీ స్థాయి అధికారి) అందుబాటులో ఉంటాయని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు ఎస్పీ, రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచుతున్నట్టు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, కమ్యూనికేషన్, ప్రహరీ గోడలు(బౌండరీ వాల్స్) లేని పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీవో, ఎంఆర్‌ఓలతో సమన్వయం చేసుకుని ఎన్నికలకు ముందే తాత్కాలిక ఫెన్సింగ్, బారికేడింగ్ పూర్తి చేయించాల న్నారు. సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, పోలింగ్ రోజున ప్రతి గంటకు సమాచారం అందేలా కమ్యూనికేషన్ వ్యవస్థను పక్కాగా సిద్ధం చేసుకోవాలన్నారు.
రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై నిఘా, బైండోవర్ అయిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఓటు వేసిన అనంతరం వారు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరకుండా పి.ఎ.సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ సమయంలో కేంద్రాల బయట ఎటువంటి గుంపులు చేరకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మద్యం, బెల్ట్ దుకాణాలపై ఉక్కుపాదం మోపడం జరిగిందని, 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయించాలన్నారు.


