యలమంచిలి ఛైర్‌పర్సన్‌గా మూడోసారి పిళ్లా రమాకుమారి
15 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
కోరం లేక వైస్‌ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా
నర్సీపట్నం చైర్‌పర్సన్‌గా పద్మావతి
వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. మూడోసారి ఛైర్‌పర్సన్‌గా పిళ్లా రమాకుమారి బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలోని 32 వార్డులకు ఎన్నికై న కౌన్సిలర్లలో 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వైస్‌ఛైర్మన్ ఎన్నికకు అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి, అడ్డరోడ్డు ఆర్డీవో కేవీ రామలక్ష్మి ప్రకటించారు.
మున్సిపల్ కార్యాలయం రెండో అంతస్తులో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. టీడీపీకి చెందిన 12 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు వార్డు కౌన్సిలర్ల పేర్లను అక్షర క్రమంలో పిలవగా, ఆర్డీవో రామలక్ష్మి వారితో ప్రమాణం చేయించారు. 7, 14వ వార్డుల కౌన్సిలర్లు బొడ్డేటి చంద్రరావు, కొఠారు లక్ష్మి ప్రమాణ పత్రాన్ని చదవలేకపోవడంతో ఆర్డీవో చదివి వినిపించారు. అనంతరం సభ్యుల నుంచి అధికారులు సంతకాలు తీసుకున్నారు. మొత్తం 32 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో కోరం ఉండాలంటే కనీసం 17 మంది హాజరుకావాలి. అయితే, సోమవారం 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. జనసేనకు చెందిన 11 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేచి చూసినప్పటికీ కోరం లేకపోవడంతో వైస్‌ఛైర్మన్ ఎన్నికను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. మంగళవారం కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఆర్డీవో తెలిపారు.
వైస్‌ఛైర్మన్ పదవిపై కూటమిలో విభేదాలు
యలమంచిలి మున్సిపల్ వైస్‌ఛైర్మన్ పదవి కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. సర్దుబాటులో భాగంగా వైస్‌ఛైర్మన్ పదవిని టీడీపీకి కేటాయిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని జనసేన వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పదవిని జనసేనకు కేటాయించాలని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేనకు చెందిన 11 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. మరోవైపు టీడీపీ, బీజేపీకి చెందిన కౌన్సిలర్లతోపాటు ఒక స్వతంత్ర సభ్యుడిని కూడా ప్రత్యేక శిబిరానికి తరలించారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.కూటమి పార్టీల మధ్య నెలకొన్న పదవుల పంపకాల వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వైస్‌ఛైర్మన్ పదవిని దక్కించుకునే విషయంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్ వర్గాలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో మంగళవారం జరిగే ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. జనసేన, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మరోసారి గైర్హాజరైతే వైస్‌ఛైర్మన్ ఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు విచ్చేశారు. అనంతరం నూతనంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లగా ఎన్నికై న 40 మంది కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఒకరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కరణం అమ్మాజీ ప్రమాణస్వీకారం చేశారు.
ముగ్గురు జనసేన కౌన్సిలర్లు, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు 34 మంది ఉన్నారు. వీరందరిచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వి.వి.రమణ ప్రమాణస్వీకారం చేయించారు. మున్సిపల్ కార్యాలయం అవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణుల వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పర్యవేక్షించారు.
వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ ఎన్నిక అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. చైర్మన్ పీఠం టీడీపీకి దక్కడంతో, వైస్‌చైర్మన్ పదవి కోసం జనసేన నాయకత్వం గట్టి ప్రయత్నాలు చేశారు. జనసేన పార్టీ అధిష్టానం వైస్‌చైర్మన్ పదవికి 13వ వార్డు జనసేన నుంచి గెలుపొందిన అద్దెపల్లి సౌజన్య పేరును సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ముందు నుంచి జనసేనలో రెండు వర్గాల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది. సీట్లు సర్దుబాటు విషయంలో టీడీపీ నుంచి స్పష్టమైన విధానం లేకపోవడంతో చైర్మన్ స్థానానికి సౌజన్య నామినేషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం ఆదేశాలతో సౌజన్య చైర్మన్ బరిలో నుంచి తప్పుకుని, కౌన్సిలర్‌గా బరిలో నిలిచారు. రెండు వర్గాల అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ సౌజన్య వర్గానికి పార్టీ అధిష్టానం బీ–ఫామ్‌లు ఇవ్వడంతో రెండవ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా టీడీపీ కౌన్సిలర్లు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. చైర్‌పర్సన్ సైతం సభ నుంచి నిష్క్రమించారు. సభలో సౌజన్యంతో పాటు మరో ఇద్దరు జనసేన కౌన్సిలర్లు మిగిలారు. వైస్‌చైర్మన్ ఎన్నిక విషయమై జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్నదొరబాబు రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వి.వి.రమణను సంప్రదింపులు చేశారు. అనంతరం ఆర్డీవో మీడియాతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు అభ్యర్ధుల తరపున ఫామ్–ఏ, ఫామ్–బిలు సమర్పించకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని ఆర్డీవో తెలిపారు.


