కార్తీక పౌర్ణమి వేళ ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయ ప్రదక్షిణం తరలిరానున్న వేలాది మంది భక్తులు
రాంబిల్లి: కార్తీక పౌర్ణమి పరమ శివునికి ఎంతో ప్రీతికరం. పరమ పవిత్రమైన పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఫణిగిరి గిరి ప్రదక్షిణం కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంచదార్ల పుణ్యక్షేత్రంలో 2024లో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ ఏడాది మూడో గిరి ప్రదక్షిణ జరగబోతుంది. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
ఆలయ విశిష్టత..
క్రీ.శ. 11, 13 శతాబ్ధాల్లో ఇక్కడి పుణ్యక్షేత్రంలో కాశీ విశ్వేశ్వరస్వామి, ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. పచ్చని ఫణిగిరి పర్వతం, నిత్యం ప్రవహించే ఐదు పుణ్యధారలు ఈ క్షేత్రంలో దర్శనమిస్తాయి. ఇక్కడి పుణ్యధారల్లో ముఖ్యంగా ప్రధానమైన ఆకాశధార వద్ద పుణ్యస్నానం ఆచరించి ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించి పూజలు చేస్తే సకల పాపాలు హరించిపోయి సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఏర్పాట్లు పూర్తి
గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రదక్షిణ చేసే గ్రామాల్లో దాతలు పాలు, నీరు, మజ్జిగ, పులిహోర ఇతర ఫలహారాలను స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పో లీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సీఐ నర్సింగరావు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని సీఐ కోరారు.
గిరి ప్రదక్షిణం..పుణ్యప్రదం
పరమశివుడు కొలువైన పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ వున్న ఫణి గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మహా పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉదయం 6 గంటలకు ఈ గిరి ప్రదక్షిణం ప్రారంభం కానుంది. సుమారు 31 కిలోమీటర్ల మేర వుండే గిరి ప్రదక్షిణం సాయంత్రం 6 లోపే పూర్తి కానుంది. పంచదార్ల పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఽకొత్తూరు, గోకివాడ, మూలజంప, మడకపాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి, భాస్కరరెడ్డి లేఅవుట్, పూడి పునరావాసకాలనీ, గొర్లె ధర్మవరం, వెంకటాపురం, ధార భోగాపురం, ధారపాలెం, అప్పారాయుడుపాలెం మీదుగా పంచదార్ల చేరుకోవడంతో గిరి ప్రదక్షిణం పూర్తవుతుంది.


