కిలోకు రూ.200 తగ్గిన వైనం
రూ.450 నుంచి రూ.250కు పడిపోయిన వైనం
మూడేళ్లుగా కొనుగోళ్లకు దూరంగా జీసీసీ
దళారుల చేతుల్లో మార్కెటింగ్.. గిరిజనులకు నష్టాలు
ఏజెన్సీలో జాఫ్రా పంటకు ఈ ఏడాది కాపు సమృద్ధిగా ఉన్నా గిరిజన రైతులకు మాత్రం ఆదాయం ఆశాజనకంగా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాఫ్రా గింజలకు స్థానికంగా ధరలు పడిపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. గత ఏడాది కిలో రూ.450 పలికిన ధర ఈసారి రూ.250కే పరిమితమైంది. మరోవైపు గిరిజనులను ఆదుకోవాల్సిన జీసీసీ మూడేళ్లుగా కొనుగోళ్లు నిలిపివేయడంతో దళారులే ధరలను శాసిస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో జాఫ్రా సాగు చేస్తున్న గిరిజనులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షగా మారింది.
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో జాఫ్రా సాగు చేస్తున్న గిరిజన రైతులకు గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. గత మూడేళ్లుగా జాఫ్రా గింజల కొనుగోళ్లకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దూరంగా ఉండడంతో దళారీ వ్యాపారులదే రాజ్యమవుతోంది. ఫలితంగా జాఫ్రా పంటకు మంచి దిగుబడి వస్తున్నా గిరిజన రైతులకు మాత్రం ఆశించిన ఆదాయం లభించడం లేదు. ఈ ఏడాది కూడా తోటల్లో కాపు అధికంగా ఉండడంతో రైతులు గింజలను సేకరించి, వేరు చేసి, ఎండబెట్టి విక్రయాలకు సిద్ధమయ్యారు. అయితే వ్యాపారులు ధరలను భారీగా తగ్గించడంతో ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా..
అద్దకం రంగులతో పాటు పలు ఆహార రంగుల తయారీ పరిశ్రమల్లో సహజసిద్ధమైన రంగుల కోసం జాఫ్రా గింజలను వినియోగిస్తారు. ఢిల్లీ మార్కెట్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వీటికి డిమాండ్ ఉంది. పలు దేశాలకు కూడా వ్యాపారులు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో వన సంరక్షణ సమితుల ద్వారా అటవీశాఖ ప్రోత్సాహంతో పాటు కాఫీ తోటలు, మెట్ట భూముల్లోనూ గిరిజనులు జాఫ్రా మొక్కలను గతంలోనే నాటారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో జాఫ్రా తోటలు విస్తరించి ఉన్నాయి. ఒక్కో చెట్టు నుంచి సుమారు ఏడు కిలోల వరకు ఎండు జాఫ్రా గింజలు లభిస్తున్నాయి.
భారీగా పతనం.. కిలోకు రూ.200 తగ్గింపు
జాఫ్రా గింజల ధరలను వ్యాపారులు భారీగా తగ్గించారు. గత ఏడాది కిలో రూ.450 చొప్పున కొనుగోలు చేయగా, ఈ ఏడాది సంతల్లో కేవలం రూ.250కే కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో కిలోకు రూ.200 మేర ధర తగ్గింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో జాఫ్రా గింజలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కిలో రూ.700 నుంచి రూ.800 వరకు ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే గిరిజన రైతుల వద్ద మాత్రం వ్యాపారులు అందులో సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒడిశా వ్యాపారులు సైతం కిలో రూ.250కే కొనుగోలు చేస్తుండడంతో అక్కడి సంతలకు తీసుకెళ్లినా రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
మూడేళ్లుగా దృష్టి పెట్టని జీసీసీ
గిరిజన సహకార సంస్థ గత మూడేళ్లుగా జాఫ్రా గింజల కొనుగోళ్లను నిలిపివేసింది. నష్టాలు వస్తున్నాయనే కారణంతో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో గిరిజన రైతులు ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్లో పోటీ లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా జీసీసీ కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో దళారీ వ్యాపారులకు అనుకూలంగా మారిందని, తాము మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీసీసీ కొనుగోలు చేయాలి
జీసీసీ ఈ ఏడాదైనా జాఫ్రా గింజలను కిలో రూ.600 చొప్పున కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించకపోవడంతో దళారీ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులమైన మేమంతా ఆర్థికంగా నష్టపోతున్నాం.
– పి.బీమేష్, గిరిజన రైతు, డల్లాపల్లి,
పాడేరు మండలం


