యలమంచిలి రూరల్: యలమంచిలి పురపాలక సంఘ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం పురపాలక సంఘ కార్యాలయ భవనంలో కొత్తగా నిర్మించిన రెండో అంతస్తులో హాలును సిద్ధం చేసినట్టు కమిషనర్ బి.జె.ఎస్ ప్రసాదరాజు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే గెలిచిన ఛైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లకు అధికారికంగా సమాచారం ఇచ్చారు. నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, 32 మంది వార్డు కౌన్సిలర్లతో తొలుత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మంది కౌన్సిలర్లు హాజరైతే ఎన్నిక నిర్వహించడానికి కోరం సరిపోయినట్టు పరిగణిస్తారు. గతంతో పోల్చితే నూతన పాలకవర్గంలో సభ్యుల సంఖ్య పెరిగింది. గత పాలకవర్గంలో 25 మంది సభ్యులుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 32కు పెరిగింది. దీనికి అనుగుణంగా హాలులో కుర్చీల సంఖ్య పెంచారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు.
వైస్ చైర్మన్‌పై పీఠముడి
ఈసారి పురపాలక ఎన్నికల్లో చైర్‌పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే పరోక్ష పద్ధతిలో జరగనుంది. గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం తర్వాత వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కూటమిలో ఇప్పటివరకు వైస్ చైర్మన్ అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి కూటమి భాగస్వామ్యపక్షాల పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 32 వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి 6, టీడీపీకి 12, జనసేనకు 11, బీజేపీకి 3 వార్డు కౌన్సిలర్ల బలం వుంది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లి శివనారాయణ మూర్తి అలియాస్ నానాజీ(30వ వార్డు కౌన్సిలర్), జనసేన పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ కర్రి ఝాన్సీ వరలక్ష్మిల మధ్య వైస్ చైర్మన్ పదవికి పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన పిళ్లా రమాకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికై న సంగతి తెల్సిందే. ఆమె నివాసంలో ఆదివారం టీడీపీ, బీజేపీల పార్టీలకు చెందిన వార్డు కౌన్సిలర్లతో ప్రత్యేకంగా భేటీ జరిగింది. కూటమి ధర్మంలో భాగంగా 30వ వార్డు కౌన్సిలర్ గొర్లి నానాజీ పేరు ఖరారైనట్టు, అతనికి పిళ్లా రమాకుమారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్, టీడీపీ, బీజేపీ సభ్యులంతా అభినందనలు తెలియజేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో జనసేన సభ్యులతో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కూడా సమావేశమై, ప్రత్యేక సూచనలిచ్చినట్టు తెలిసింది. అందరూ ఒకేమాటపై ఉంటే అనుకున్నది సాధించుకోవచ్చని ఎమ్మెల్యే జనసేన సభ్యులకు చెప్పినట్టు సమాచారం. వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే కూడా ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సభ్యులతో కూడా ఆశావహులు టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. అవసరమైతే తమకు మద్దతునివ్వాలని కూటమి పార్టీల నాయకులు కోరుతున్నారు.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువు తీరనుంది. చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి, కౌన్సిలర్లగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర అన్ని ఏర్పాట్లు చేశారు.


