ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి దుర్మరణం
పెందుర్తి: ఇంట్లో జరిగిన పూజకు సంబంధించిన సామగ్రిని చెరువులో కలుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడిన వ్యక్తి మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలివి.. చినముషిడివాడలో నివాసం ఉంటున్న మన్యం శంకర్రావు(62) నగరంలోని కాన్వెంట్ కూడలి వద్ద ఓ స్టీల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శంకర్రావు భార్య అరుణ శనివారం ఇంట్లో పూజలు చేశారు. ఆ సామగ్రిని పెందుర్తిలోని పెద్ద చెరువులో కలిపేందుకు ఆదివారం ఉదయం చెరువు వద్దకు శంకర్రావు వచ్చాడు. సామగ్రిని చెరువు లోపలికి వేస్తున్న క్రమంలో ఒడ్డు నుంచి జారడంతో నీటిలో పడి మునిగిపోయాడు. ఆ సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకర్రావు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా ఒడ్డు సమీపంలో విగతజీవిగా కనిపించడంతో హతాశులయ్యారు. మృతునికి భార్య అరుణ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


