నేడు కొలువుదీరనున్న జీవీఎంసీ నూతన పాలకవర్గం
మేయర్ ముక్కా శ్రావణి, కార్పొరేటర్లకు సవాళ్ల స్వాగతం
ఆర్థిక భారం.. కాంట్రాక్టర్లకు రూ.460 కోట్ల బకాయిలు
తాగునీటి కష్టాలు.. అస్తవ్యస్తంగా డ్రైనేజీలు
గుంతల రోడ్లు.. గజిబిజి ట్రాఫిక్‌తో అవస్థలు
టౌన్‌ప్లానింగ్.. అక్రమ నిర్మాణాలు
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. నూతన మేయర్ ముక్కా శ్రావణితో పాటు ఎన్నికై న కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త పాలకవర్గానికి పదవులు స్వాగతం పలుకుతున్నా.. అంతకుమించిన సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. నగరంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, ట్రాఫిక్ వంటి మౌలిక సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు, కాంట్రాక్టర్ల బకాయిలు, టౌన్‌ప్లానింగ్ వివాదాలు కొత్త పాలకవర్గం ముందున్నాయి. గత పాలకవర్గం చేపట్టిన పనులు, ప్రత్యేకాధికారి పాలనలో జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుంటూ.. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాల్సిన బాధ్యత కొత్త కౌన్సిల్‌పై ఉంది.
ఆర్థిక భారం.. బకాయిల సవాలు
జీవీఎంసీలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.460 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. నిధుల కొరత, పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొత్త పనులకు అడ్డంకిగా మారుతున్నాయి. విస్తరించిన 120 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కొత్త పాలకవర్గానికి కీలకం కానుంది.
తాగునీరు.. డ్రైనేజీపై దృష్టి
వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలి. తాగునీటి వనరులను ప్రైవేట్ సంస్థలకు మళ్లించే ప్రయత్నాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవాలి. మరోవైపు భూగర్భ జలాల పెంపు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, వర్షాకాలంలో ముంపు నివారణపై ప్రత్యేక దృష్టి అవసరం.
స్వచ్ఛ విశాఖకు సవాళ్లు
చెత్త సేకరణ, డంపింగ్ యార్డు నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కొత్త పాలకవర్గానికి మరో పరీక్ష. వాణిజ్య సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. పది జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచి పౌర సేవలను వేగవంతం చేయాలి.
గుంతల రోడ్లు.. గజిబిజి ట్రాఫిక్
ఇటీవల తుపానులు, వర్షాలతో ప్రధాన రహదారులతో పాటు వార్డుల్లోని అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిని నాణ్యతా ప్రమాణాలతో పునరుద్ధరించాల్సి ఉంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా 35 ప్రధాన కూడళ్లను సిగ్నల్ ఫ్రీ జోన్లుగా మార్చే ప్రాజెక్టు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ పనులను వేగవంతం చేయాల్సి ఉంది.
భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ క్రమబద్ధీకరణ, టీడీఆర్ సర్టిఫికెట్లకు సంబంధించి వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేషన్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. భీమిలి తీర ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెస్టో బార్లు, పబ్‌ల వ్యవహారంలో నిర్లక్ష్యంపై హైకోర్టు సైతం జీవీఎంసీ అధికారులను ఇటీవల హెచ్చరించింది. ఈ అంశాలపై కొత్త పాలకవర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇలా.. ఆర్థిక కష్టాల నుంచి మౌలిక సదుపాయాల వరకు ఎన్నో సమస్యలు కొత్త పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. కొత్తగా కొలువుదీరుతున్న పాలకవర్గం.. వారి నిత్య సమస్యలకు ఎంత త్వరగా పరిష్కారం చూపుతుందన్నదే అసలైన పరీక్ష!


