ప్రాచీన శ్రీరాముని నాణెం అంటూ బురిడీ అయస్కాంత పూతతో బియ్యాన్ని ఆకర్షిస్తున్నట్లు నకిలీ ప్రదర్శన నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ద్వారకానగర్: ప్రాచీన శ్రీరాముని నాణెం పేరుతో అధిక లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు కాజేసిన నలుగురు సభ్యుల ముఠాను ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఉడిమూడికి చెందిన కొటిపల్లి రమేష్ (38) చిన్న వ్యాపారాల్లో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రాచీన మహిమగల నాణేలు ఉంటే భారీ లాభాలు వస్తాయన్న ప్రచారాన్ని నమ్మాడు. స్నేహితుడు కోదండ నాయుడు ద్వారా ఈ ఏడాది ఆగస్టులో అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన పెంటకోట గోవిందరాజు (56)తో పరిచయం ఏర్పడింది. విజయనగరం ప్రాంతంలో అతీంద్రియ శక్తులున్న ప్రాచీన శ్రీరాముని నాణెం ఉందని, దాని విలువ రూ.8 లక్షలని గోవిందరాజు రమేష్‌ను నమ్మించాడు.
రూ.8 లక్షలకు ఒప్పందం
గోవిందరాజు, శ్రీను అలియాస్ అనుపోజి గౌరీ (38) కలిసి రమేష్, మధుకుమార్‌లను విజయనగరం జిల్లా డెంకాడ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ గొర్లె సూర్యారావు అలియాస్ సూర్య (41), చింతాడ నాగేశ్వరరావు అలియాస్ రవి (40) నకిలీ నాణెం చూపించారు. రాగి నాణేనికి అయస్కాంత పూత పూసి, బియ్యం దగ్గర ఉంచి అవి నాణెం వైపు ఆకర్షితమవుతున్నట్లు ప్రదర్శించారు. దీంతో నాణేనికి ప్రత్యేక శక్తులున్నాయని నమ్మిన రమేష్ రూ.8 లక్షలకు కొనుగోలు చేసేందుకు అంగీకరించాడు. ముందస్తుగా రూ.5 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 3న విశాఖ అక్కయ్యపాలెంలోని మహారాణి పార్లర్ జంక్షన్ వద్ద ఫోన్‌పే ద్వారా గోవిందరాజు, సూర్యలకు కలిపి రూ.లక్ష చెల్లించాడు. 10న అదే ప్రాంతంలో మధుకుమార్‌తో కలిసి నలుగురు నిందితులకు మరో రూ.4 లక్షలు నగదుగా అందజేశాడు. మొత్తం రూ.5 లక్షలు తీసుకున్న నిందితులు మిగిలిన రూ.3 లక్షలు చెల్లిస్తే నాణెం అప్పగిస్తామని చెప్పి కాలయాపన చేశారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారు.
లాడ్జిలో మరింత డబ్బుకు డిమాండ్
ఈ నెల 17న నాణెం అప్పగిస్తానంటూ గోవిందరాజు రమేష్, మధుకుమార్‌లను దొండపర్తిలోని అయోధ్య హోటల్ లాడ్జికి పిలిపించాడు. గది నంబర్ 101 వద్దకు వచ్చిన బాధితులకు నాణెం ఇవ్వకుండా మరింత డబ్బు డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయామని గుర్తించిన రమేష్ అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నలుగురి అరెస్టు.. రూ.5 లక్షలు రికవరీ
బాధితుడి ఫిర్యాదుతో ఫోర్త్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. రాజేష్ కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తును ఎస్‌ఐ వి. చిన్నబాబుకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మోసానికి ఉపయోగించిన నకిలీ రాగి నాణెం, బాధితుడి నుంచి వసూలు చేసిన రూ.5 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


