డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.1.94 కోట్ల టోకరా | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.1.94 కోట్ల టోకరా

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

విశ్రాంత ఉద్యోగిని బెదిరించి 13 విడతల్లో నగదు స్వాహా

అంతర్జాతీయ సైబర్‌ ముఠా గుట్టురట్టు

బెంగళూరులో ఆరుగురు నిందితుల అరెస్ట్‌

ద్వారకానగర్‌: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో విశాఖకు చెందిన 65 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని బెదిరించి రూ.1.94 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేర ముఠా గుట్టును విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా.. తాజాగా బెంగళూరులో మరో ఆరుగురిని పట్టుకున్నారు. టెలికాం, పోలీస్‌, సీబీఐ, ఆర్బీఐ అధికారులమంటూ బాధితుడికి ఫోన్‌ చేసిన నిందితులు.. ఆయన ఆధార్‌ వివరాలతో తీసుకున్న సిమ్‌ కార్డు అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించారని, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి నగదు ధ్రువీకరణ పేరుతో 13 విడతల్లో రూ.1.94 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం.. లావాదేవీల ఆధారంగా చిత్తూరు జిల్లా పుంగనూరు, బెంగళూరులో తనిఖీలు నిర్వహించింది. ఈ నెల 20న బెంగళూరులోని జీవన్‌ భీమా నగర్‌ పరిధిలో ఆరుగురిని అరెస్టు చేసింది. వీరిని విశాఖకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

కాంబోబియా నేరగాళ్లతో లింకులు

దర్యాప్తులో ప్రధాన నిందితుల్లో ఒకడైన మల్కాపురంకు చెందిన బలగ లోకేష్‌కు కంబోడియాలోని సైబర్‌ నేరగాళ్లతో సంబంధాలున్నట్లు వెల్లడైంది. బెంగళూరుకు చెందిన ఆల్విన్‌ రిచర్డ్‌తో కలిసి అధిక కమీషన్ల ఆశ చూపి పలువురి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిని విదేశీ ముఠాలకు అందించేవారు. బాధితుల నుంచి కాజేసిన సొమ్మును ఈ ఖాతాల్లో జమ చేయించి ఉపసంహరించేవారు. అనంతరం యాసీన్‌ అహ్మద్‌ సఫీర్‌ ద్వారా యూఎస్‌డీటీ క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు మళ్లించేవారు. ఈ ముఠా ద్వారా సుమారు రూ.3 కోట్ల మోసపు సొమ్ము మళ్లించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులు బలగ లోకేష్‌ (25)తో పాటు బెంగళూరుకు చెందిన ఆల్విన్‌ రిచర్డ్‌ (26), యాసీన్‌ అహ్మద్‌ సఫీర్‌ (21), గాజువాకకు చెందిన జువ్వల భవానీ శంకర్‌ (26), అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన షేక్‌ ముబారక్‌ (28), షేక్‌ సుల్తాన్‌ బాషా (30)ల నుంచి మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని కీలక డిజిటల్‌ ఆధారాలు సేకరించారు. కేసులో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement