స్నేహితులతో సరదాగా గడిపేందుకు వచ్చి అదృశ్యం
సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురిలో జాహిద్ ఆచూకీ గల్లంతు
24 గంటలు దాటినా లభించని సమాచారం.. మిస్టరీగా మారిన ఘటన
కొమ్మాది: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. స్నానానికి సముద్రంలోకి దిగిన నలుగురిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మరో విద్యార్థి ఆచూకీ తెలియకుండా పోయింది. నగరంలోని అంబుసారంగ్ వీధికి చెందిన సయ్యద్ జాహిద్ రజా (19) డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రుషికొండ బీచ్‌కు చేరుకున్నాడు. వీరిలో నలుగురు స్నానానికి సముద్రంలోకి దిగారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరుకున్నారు. జాహిద్ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరి ఉంటాడని స్నేహితులు ముందు భావించారు. అప్పటికీ అతడి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వరకు జాహిద్ ఇంటికి చేరకపోవడంతో తండ్రి సయ్యద్ జావేద్ అలీ ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి నౌక, రెండు హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మిస్టరీగా మారిన గల్లంతు
ఎనిమిది మంది స్నేహితులు కలిసి బీచ్‌కు వెళ్లగా.. వారిలో ఒకరు కనిపించకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. నలుగురు సముద్రంలో స్నానం చేస్తుండగా జాహిద్ గల్లంతైన విషయాన్ని మిగిలిన ముగ్గురు గుర్తించకపోవడం గమనార్హం. సముద్రంలో కెరటాల ఉధృతికి కొట్టుకుపోతే కేకలు వేసే అవకాశం ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితిని ఎవరూ గమనించలేదని తెలుస్తోంది. బీచ్‌లో పర్యాటకులు, లైఫ్‌గార్డులు ఉన్నప్పటికీ ఘటనను ఎవరూ గుర్తించకపోవడం, 24 గంటలు గడిచినా ఆచూకీ లభించకపోవడం, సీసీ కెమెరాల ఫుటేజీలోనూ ఆధారాలు లభించకపోవడంతో జాహిద్ ఏమయ్యాడన్నది అంతుచిక్కడం లేదు.


