మాజీ మంత్రి అమర్‌నాథ్
బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయతీ వడ్డాది అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దాడి గోవిందను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కోరారు. ఆదివారం రాత్రి వడ్డాదిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కూటమి రెండున్నరేళ్ల పాలనలో వడ్డాది అభివృద్ధి కోసం పట్టించుకోని నేతలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయండి అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో రెండు ఎంపీటీసీలను గెలిపించినట్లే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న దాడి గోవింద గతంలో ఎంపీపీగా చేసి మళ్లీ వీఆర్వోగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారన్నారు. ఇదే అనుభవంతో వడ్డాదిని ఆదర్శంగా అభివృద్ధి చేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ దొండా నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, సర్పంచ్ అభ్యర్థి గోవింద, టౌన్ అధ్యక్షుడు అడపా శ్రీను, నాయకులు గుమ్మిడి ప్రసాద్, కె. రమణ, శంకర్ తదితర్లు పాల్గొన్నారు.


