విద్యా సంవత్సరం మధ్యలోనే మూసివేతకు దిశగా దీక్ష అకాడమీ?
ప్రశ్నార్థకంగా 50 మంది విద్యార్థుల భవిష్యత్తు
యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్న ఆర్‌ఐవో
మధురవాడ: రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యా సంవత్సరం మధ్యలోనే కళాశాల మూసివేస్తున్నారన్న వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొమ్మాది నవోదయ ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న దీక్ష ఐఐటీ–జేఈఈ అండ్ మెడికల్ అకాడమీని మధ్యలోనే మూసివేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపింది. అకస్మాత్తుగా కళాశాల మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ సుమారు 50 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు. యాజమాన్య ప్రతినిధులతో వాగ్వాదానికి దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్‌ఐవో) మురళీధర్ స్వయంగా కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
భాగస్వాముల మధ్య విభేదాలే కారణమా?
దీక్ష ఐఐటీ–జేఈఈ అండ్ మెడికల్ అకాడమీ పేరుతో మధురవాడతో పాటు రామాటాకీస్, ఎన్‌ఏడీ ప్రాంతాల్లో మూడు బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.5 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మధురవాడ బ్రాంచ్‌లో సుమారు 50 మంది విద్యార్థులు చదువుతుండగా, కళాశాలతో పాటు హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏడుగురు భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విభేదాలు తలెత్తడంతోనే కళాశాల నిర్వహణ నిలిపివేసే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. కొందరు భాగస్వాములు దుబాయ్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో విద్యా సంవత్సరం మధ్యలోనే కళాశాలను మూసివేస్తారనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది.
విద్యార్థులకు నష్టం జరగనివ్వం
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో గురువారం కళాశాలకు చేరుకున్న ఆర్‌ఐవో మురళీధర్ యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వివరాలు సేకరించారు. భాగస్వాములందరినీ శుక్రవారం పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


