అనకాపల్లి : జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఈనెల 20న స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరుతున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ పి.వి.వి.నరసింహరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 30 పోలీస్ యాక్ట్, 114 సెక్షన్ అమలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉంటుందన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయానికి జిల్లాలో వివిధ మండలాల నుంచే వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జిల్లా పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ గుమిగూడి ఉండరాదన్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నుకునే ఓటు హక్కు కలిగిన సభ్యులను (జెడ్పీటీసీలను)మాత్రమే జిల్లా పరిషత్ కార్యాలయానికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు హాజరయ్యే జెడ్పీటీసీ సభ్యుల వాహనాల పార్కింగ్ కోసం ఎన్టీఆర్ క్రీడామైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని, పాత్రికేయ వాహనాల పార్కింగ్ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


