సాక్షి, అనకాపల్లి : జిల్లాలోని 24 మండలాలకు సంబంధించిన ఎంపీపీ ఎన్నికలు గురువారం పూర్తి అయ్యాయి. అన్ని మండలాల్లో దాదాపు కూటమి అభ్యర్థుల ఆధిక్యం కనిపించింది. మునగపాక మండలంలో మాత్రం వైఎస్సార్‌సీపీకి, కూటమికి చెరో 8 ఎంపీటీసీ సెగ్మెంట్‌లు రావడంతో ఈ ఎన్నికపై హైడ్రామా నడిచింది. ముందు రోజు నుంచి పోలీసులు చేసిన హడావిడి, సీసీ కెమెరాల ఏర్పాటు,144 సెక్షన్ విధించినట్టు పేర్కొనడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది.
హైడ్రామా..?
పోలీస్ బందోబస్తుతో పాటు మునగపాక ఎంపీడీవో కార్యాలయ పరిధిలోని ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. సమీపంలోని దుకాణాలను కూడా మూయించారు. అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీటీసీలు హాజరు కావడం, ప్రమాణ స్వీకరం చేయడం పూర్తయిన తర్వాత ఎంపీపీ ఎన్నికకు ఉపక్రమించారు. ఉదయం 11 గంటలకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పూర్తి ఆధిపత్యం చెలాయించే పనిలో నిమగ్నం అయ్యారు. ఎంపీపీకి చెరో ఎనిమిది ఓట్లు రావడంతో అఽధికారులు లాటరీ తీస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ఎంపీటీసీ లాటరీకి సంబంధించి జీవో కావాలని అరగంటకు పైగా పట్టుబట్టారు. అధికారులు సంబంధిత ఉత్తర్వులు చూపించిన మేరకు లాటరీ తీయడం, ఎంపీపీ పీఠం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్‌కు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా కూటమి అనుకూల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం వెనువెంటనే గెలిచిన ఎంపీపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే రంగంలోకి దిగి తక్షణమే ఎంపీపీపైనా, ఎన్నికల అధికారులపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ అలజడి అనంతరం ఇరు పార్టీలకు చెందిన నేతల సంప్రదింపులతో వైస్ ఎంపీపీకి లాటరీ లేకుండా కూటమి తరపున చేతులెత్తే విధానాన్ని ప్రారంభించారు. కూటమి ఎంపీటీసీలు 8 మంది చేతులెత్తగా, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు స్పందించలేదు. ఈ కారణంగా ఎనిమిది ఓట్లు వచ్చిన దొడ్డి భారతిని వైస్ ఎంపీపీగా ఎన్నికయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో ఎమ్మెల్యే సుందరపు శాంతించి వెళ్లిపోయారు. అయితే గెలిచిన ఎంపీపీ మీడియాతో మాట్లాడం వివాదంగా మారిందని భావించిన రాజకీయ పార్టీలు మధ్యేమార్గంగా వైస్ ఎంపీపీ విషయంలో కూటమి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించాల్సి వచ్చింది. లేకుంటే వైస్ ఎంపీపీకి కూడా లాటరీ తీయాల్సి వచ్చేది. ఎంపీటీసీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుమారు మూడు గంటలకు పైగా నడిచిన ఈ హైడ్రామా ఎట్టకేలకు ముగిసింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అచ్యుతాపురం, రాంబిల్లిలో ప్రగడకు ఝలక్...
టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్నప్పటికీ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల్లో టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ ప్రగడకు ఝలక్ తగిలింది. రెండు మండలాల్లోనూ ప్రగడ పాచిక పారలేదు. రాంబిల్లి మండలంలో ఎంపీపీ పీఠం కోసం టీడీపీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ ప్రగడ జడ్.చింతువకు చెందిన అప్పలరాజుకు భీపాం ఇచ్చారు. 14 మంది సభ్యులున్న ఈ మండలంలో టీడీపీకి అత్యధికంగా 6 ఎంపీటీసీలు గెలిచారు. ప్రగడ ఆశించిన అప్పలరాజును కాదని మరో టీడీపీ ఎంపీటీసీ వసంతవాడ లక్ష్మీ నాగరత్నంకు ఎంపీపీ పదవి లభించింది. అయితే ఎంపీపీగా గెలిచిన వసంతవాడ లక్ష్మీని ఇండిపెండెంట్ అభ్యర్థిని గుర్తిస్తున్నట్లు స్థానిక ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. బీఫాం ఇచ్చిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తికి మెజారిటీ ఎంపీటీసీలు ఆమోదం తెలపడంతో బీ ఫాం లేని ఎంపీపీని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తున్నట్టు అధికారులు తెలపడం గమనార్హం.
అచ్యుతాపురంలోనూ అదే పరిస్థితి
అచ్యుతాపురం మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలు ఉండగా, జనసేన 7 సెగ్మెంట్‌లలో గెలిచింది.మ్యాజిక్ ఫిగర్ 11 మంది సభ్యుల ఆమోదం కావాల్సి ఉన్న నేపథ్యంలో టీడీపీకి చెందిన నలుగురు, ఇండిపెండెంట్లు 5 గురు ఒంటి గంట తర్వాత హాజరయ్యారు.అప్పటికే అందుబాటులో ఉన్న 12 మంది సభ్యులతో కోరం ఏర్పడిందని భావించిన అధికారులు ఓటింగ్ నిర్వహించగా, మార్టూరుకు చెందిన జనసేన ఎంపీటీసీ ద్వారపురెడ్డి బాబ్జీని ఎంపీపీ పీఠం వరించింది. చివరి నిమిషం వరకూ బాబ్జీని కాదని మరో అభ్యర్థికి ఎంపీపీ పీఠం దక్కేలా పావులు కదిపిన ప్రగడ కోరం ఏర్పడకుండా నిలువరించడంలో విఫలమయ్యారనేది టీడీపీ ఎంపీటీసీల వాదన. ఈ మండలానికి బీజేపీ తరపున గెలిచిన దోసూరు ఎంపీటీసీ రాజాన సన్యాసినాయుడుకి వైస్ ఎంపీపీ పీఠం వరించింది. జిల్లాలోని మిగిలిన 21 మండలాల్లో 17 మండలాల్లో కూటమి అభ్యర్థులు ఎంపీపీలు గెలవగా,బుచ్చియ్యపేట,చోడవరం,రోలుగుంట,రావికమతం మండలాల్లో మండల పరిషత్‌కు సంబంధించి ఎంపీపీ ఎన్నికలు జరగలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది.
మొల్లేటి శంకర్,
ఎంపీపీ, మునగపాక


