మునగపాక : స్థానిక మండల పరిషత్ హాలులో నాటకీయ పరిణామాల నడుమ ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అదికారి రాజశేఖరన్ నేతృత్వంలో ఎన్నిక జరిగింది. ఎంపీటీసీ ఎన్నికల్లో 16 స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీకి 8 స్థానాలు, కూటమికి మరో 8 స్థానాలు దక్కాయి. వైఎస్సార్‌సీపీ ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి శంకర్ తాను ఎంపీపీగా పోటీ చేస్తానంటూ అధికారులకు ఫారం అందజేశారు. శంకర్ పేరును వాడ్రాపల్లి ఎంపీటీసీ కాండ్రేగుల జగన్ ప్రతిపాదించగా పాటిపల్లి ఎంపీటీసీ కిలాడి దేముడు బలపరిచారు. 8మంది సభ్యులు మద్దతు పలికారు. అనంతరం కూటమి నుంచి నాగులాపల్లి–2 ఎంపీటీసీ దొడ్డి భారతి తాను ఎంపీపీగా పోటీ చేస్తానంటూ అధికారులకు ఫారం అందించారు. దీంతో భారతికి ఓటు వేసేవారంతా చేతులెత్తాలని కోరడంతో కూటమికి చెందిన 8 మంది సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఎంపీపీ పదవికి డ్రా తీశారు. డ్రాలో ఎంపీపీగా మొల్లేటి శంకర్ విజయం సాధించారు. అనంతరం నిర్వహించిన వైస్ ఎంపీపీ పదివికి భారతి ఎన్నికయ్యారు. వారికి ఎన్నికల ఽఅధికారి రాజశేఖరన్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా పరవాడ డీఎస్పీ మోహనరావు, యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎస్‌ఐ ప్రసాదరావులు తగు బందోబస్తు నిర్వహించారు.
ఎమ్మెల్యే సుందరాపు ఆగ్రహం
డ్రాలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ శంకర్ విజయం సాధించడంతో కూటమి నేతలు, ఎమ్మెల్యే విజయకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులకు భోజన వసతి కల్పించడంలోనూ నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.ఎంపీపీగా ఎన్నికై న శంకర్ మీడియా ఫొటోలకు పోజులివ్వడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేసే వరకు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించరాదని పట్టుబట్టడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే సమ్మతించడంతో వైస్ ఎంపీపీ ఎన్నికకు మార్గం సుగమమైంది. నాగులాపల్లికి చెందిన భారతి పేరుకు ఇరు పార్టీల ఎంపీటీసీలు మద్దతు తెలపడంతో ఆమెను వైస్ ఎంపీపీగా ఖరారు చేశారు.
సాక్షి విలేకరిపై ఎమ్మెల్యే అసహనం
ఎన్నికల కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన సాక్షి విలేకరిపై ఎమ్మెల్యే విజయకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వాగ్వాదాలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే, విలేకరిపై ఆగ్రహం ప్రదర్శించారు. సాక్షి పత్రిక వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరిన విలేకరిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.


