ద్వారకానగర్: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన నగర పోలీసు సిబ్బందికి పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం రివార్డులు అందజేశారు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా కట్టడి, చోరీ సొత్తు రికవరీ, సైబర్ నేరాల ఛేదనలో ప్రతిభ చూపిన హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు 260 మంది సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. సిబ్బంది ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విధుల పట్ల మరింత బాధ్యత, నిబద్ధత పెరుగుతాయని సీపీ తెలిపారు. ప్రతి నెలా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఇతర సిబ్బందిలోనూ స్ఫూర్తి నింపడంతోపాటు నగర భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యమన్నారు.


