నర్సీపట్నం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే 104 సంచార వైద్య వాహనాలు గాడి తప్పాయి. దీనికి నిదర్శనం బుధవారం గొలుగొండ మండలం, చీడిగుమ్మల పీహెచ్‌సీ వైద్యుల తీరు ఇందుకు అద్దం పడుతుంది. పీహెచ్‌పీ పరిధిలోని గిరిజన గ్రామాలైన కశిమి, వడపర్తి గ్రామాలకు సంచార వాహనం వెళ్ళింది కానీ వైద్యాధికారి లేరు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు సిబ్బంది మందులు పంపిణీతో సరిపెట్టారు. హెల్త్ అసిస్టెంట్ అప్పారావును సంప్రదించగా డాక్టర్ భోజనానికి వెళ్లారని బదులిచ్చారు. డాక్టర్ వనితను వివరణ కోరగా 104 వాహనం డ్యూటీ తనదేనని అయితే ఎమర్జెన్సీ కేసు నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు పీహెచ్‌సీకి రావాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఒక్క పీహెచ్‌సీలోనే కాదు మిగిలిన పీహెచ్‌సీల్లో వైద్యులు కూడా ఇదే విధంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా సేవలు అందుతున్నాయి. ఇందులో వైద్యాధికారితో పాటు మరో ముగ్గురు సిబ్బంది ముందుగా ప్రకటించిన విధంగా ప్రతి నెలలో రెండు రోజులు ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు వైద్య సేవలు అందించాలి. పీహెచ్‌సీల్లో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు వాహనంలో గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఉన్నతాదికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు వాహనంలో వెళ్లటం లేదు. సిబ్బంది వెళ్లి తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసే సంచార వైద్య సేవలు మందుల పంపిణీకే పరిమితమవుతున్నాయి. ఉదయం వాహనం వద్దకు వైద్యులు చేరుకుని ఫొటో దిగి వెళ్లిపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో సిబ్బంది ఇచ్చే మందులు తీసుకుని రోగులు వెళ్లితున్నారు.
104 సంచార వాహనం సేవల్లో వైద్యాధికారితో పాటు ల్యాబ్ టెక్నీషియన్, సచివాలయ ఏఎన్‌ఎం, హెల్త్ సహాయకుడు ఉండాలి. 40 రకాల ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులు (బీపీ, మధుమేహం) ఉన్న రోగులకు ప్రతి నెలా అవసరమైన మందులు అందుబాటులో ఉంచాల్సి ఉంది. వాస్తవంగా సంచార వాహనం వెంట వెళ్లే వైద్యాధికారి రోగులను పరీక్షించి అనంతరం వారి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులో నమోదు చేయాలి. దీంతో భవిష్యత్తులో రోగి వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. కానీ ఇలా చేయడం లేదని, వైద్యులు లేకుండానే సిబ్బంది గ్రామాలకు వెళ్లి తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంతిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.


