కుమ్ములాటలు
పంచాయతీ పోరులో టీడీపీకి చుక్కలు ● జనసేనకు సీట్ల కేటాయింపుపై ఆగ్రహావేశాలు
సాక్షి , అనకాపల్లి: జిల్లాలో పలు చోట్ల టీడీపీకీ చుక్కలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పొత్తు ధర్మం విషయంలో జనసేన చేస్తున్న సీట్ల డిమాండ్ ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారింది. యలమంచిలి నియోజకవర్గంలోని పూడిమడక టీడీపీ నేతలు పంచాయతీ సర్పంచ్ సీటు జనసేనకు కేటాయించారని రాద్ధాంతం చేయడం అందరికీ తెలిసిందే. యలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రగడ కార్యాలయంపై దాడులు చేసే స్థాయికి పచ్చనేతలు వెళ్లారు. మునగపాక మండలంలోని మునగపాక పంచాయతీ సీటు ముందుగా టీడీపీకీ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి సీటుని ఆశిస్తున్న కూటమి అనుకూల అభ్యర్థి నిన్న మొన్నటి వరకూ తటస్థంగా ఉన్నట్టు నటించి వైఎస్సార్‌సీపీ నేతలతో సైతం మంతనాలు జరిపారు. తీరా సీటు ఖరారు సమయం వచ్చే సరికి తన అసలు రంగు బయటపెట్టారు. మంగళవారం అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా రేసులో ఉన్న సదరు బ్రిక్ ఇండస్ట్రీ నేత కోసం మండలంలో కేటాయించిన టీడీపీ సీట్లను మార్చబోతున్నారు. టీడీపీకి కేటాయించిన ఈ సీటును ఇప్పుడు జనసేనకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటని పచ్చదళం రగిలిపోతుంది. పొరుగున ఉన్న పంచాయతీ టీడీపీ మహిళా నేత సోషల్ మీడియాలో తమకు అన్యాయం జరిగిందని పెట్టిన మెసేజ్ చర్చనీయాంశమైంది.
పచ్చదళం..పరాభవం
యలమంచిలి నియోజక వర్గంలోని మునగపాక ఎంపీపీ పీఠం విషయంలో టీడీపీని బలి చేసిన ఉదంతాన్ని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. నాగులాపల్లిలోని ఒక సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసిన అభ్యర్థి ముందు రోజు వరకూ టీడీపీ నేతగానే గుర్తింపు పొందారు. పొత్తు ధర్మంలో భాగంగా మునగపాక ఎంపీపీ పీఠాన్ని జనసేనకు కేటాయించారు. ఒక పార్టీలో ఉన్న అభ్యర్థి మరో పార్టీలోకి తీసుకురాదనేది కూటమి ధర్మం. దీంతో తెలివిగా టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ద్వారా ఒక ప్రకటన వచ్చింది. వెనువెంటనే సదరు అభ్యర్థి జనసేన నేతగా ఎంపీపీ పీఠానికి పోటీ పడ్డారు. పరిషత్ ఎన్నికల్లో మోసపోయిన పచ్చదళం ఇప్పుడు పంచాయతీ పోరులోనూ అపహాస్యం పాలయ్యారు. టీడీపీ ప్రధాన పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో ఇన్‌ఛార్జ్ వ్యవహార శైలితో టీడీపీకీ తీవ్ర నష్టం వాటిల్లుతుందనేది తెలుగు తమ్ముళ్ల వేదన. తాము ఆశిస్తున్న చోట జనసేనకు సీట్లు ఇవ్వడం ద్వారా టీడీపీ నియోజకవర్గ తీరుపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత యలమంచిలి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ని మార్చి అతని స్థానంలో యలమంచిలికి చెందిన కీలక నేత కుమారునికి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు జెడ్పీటీసీ సీట్ల కేటాయింపులో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని రగిలిపోతున్న రాంబిల్లికి చెందిన దివంగత నేత లాలం భాస్కర్ అనుచరులు కొన్ని చోట్ల రెబెల్స్‌ని గెలిపించుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. యలమంచిలి మున్సిపల్ స్థానాన్ని తమకు దక్కించుకోవడం ద్వారా భాజాపా నేతలు రానున్న కాలంలో యలమంచిలి ఎమ్మెల్యే సీటుని కమలానికి దక్కేలా పావులు కదుపుతున్నారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందిన దొప్పెర్ల మాజీ సర్పంచ్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చిన్నారావుకు జెడ్పీటీసీ సీటు రాకుండా అడ్డుకున్నది కమలదళమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అచ్యుతాపురం ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చేతి చమురు వదిలించుకున్న ఎమ్మెల్యే సోదరుని అనుచరునికి చుక్కలు చూపిస్తున్న నియోజకవర్గ టీడీపీ నేతకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలనే ఉద్ధేశ్యంతో జనసైనికులు ఉన్నారు. ఇలా స్వపక్షంలోనూ ,మిత్ర పక్షంలోనూ ప్రతికూలత మూటగట్టుకున్న టీడీపీ నియోజకవర్గ నేత తీరుపై పంచాయతీ ఎన్నికల సందర్భంగా అవలంభిస్తున్న సీట్ల ఖరారు ధోరణి పచ్చదండుకు మింగుడు పడడంలేదు.


