నేటి నుంచి 21 వరకూ జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
బలమైన ఈదురుగాలులు కూడా
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
అధికారుల సూచనలు పాటించాలి
కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల: ఆక్వాన్ తుఫాన్ నేపధ్యంలో జిల్లా యాంత్రాంగం అప్రమత్తమై, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేలా మున్సిపల్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్, అన్ని రెవెన్యూ డివిజన్‌లు, మండల స్థాయిలలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడమైందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తుఫాను సమయంలో సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా సెల్‌ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత సంస్థలను కోరడమైందన్నారు. జిల్లాలోని సాగునీటి చెరువులు, రిజర్వాయర్లు, నీటిపారుదల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి మట్టాలను పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు


