చోడవరం టీడీపీలో ముసలం! | - | Sakshi
Sakshi News home page

చోడవరం టీడీపీలో ముసలం!

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

సర్పంచ్‌ టికెట్‌ కేటాయింపుపై యువత, మహిళల తిరుగుబాటు

మరోసారి గూనూరు పెదబాబుకే అభ్యర్థిత్వం ఖరారు

ఎమ్మెల్యే రాజును నిలదీసిన పార్టీ శ్రేణులు

చోడవరం: చోడవరం తెలుగుదేశం పార్టీలో సర్పంచ్‌ అభ్యర్థి ఎంపిక చిచ్చు రేపింది. పార్టీ టికెట్‌ కేటాయింపులో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజును నిలదీశారు. ఒకే కుటుంబానికి వరుసగా పదవులు కట్టబెడుతున్నారని, పార్టీ కోసం తాము పనిచేయడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమావేశం వాడీవేడిగా సాగి, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చోడవరం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి కూటమి తరఫున ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి సకురు కోటేశ్వరరావు, గూనూ రు పెదబాబు, గూనూరు పెద అచ్చిబాబు, నౌడు సుధాకర్‌ నామినేషన్లు వేయగా.. జనసేన నుంచి పినపాత్రుని శ్రీనివాసరావు బరిలో నిలిచారు. సీట్ల సర్దుబాటులో ఈ పంచాయతీ టీడీపీకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే రాజు సమక్షంలో పంచాయతీ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్టు చెబుతూనే మరోసారి గూనూరు మల్లునాయుడు అన్న య్య పెదబాబుకే సర్పంచ్‌ టిక్కెట్‌ ఖరారు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా సర్పంచ్‌, ఎంపీపీ, గోవాడ చక్కెర కర్మాగారం వంటి కీలక పదవులు ఒకే కుటుంబానికి దక్కుతున్నాయని కార్యకర్తలు ప్రశ్నించారు. తాజాగా ఎంపీపీ పదవి కూడా గూనూరు మల్లునాయుడుకు కేటాయించిన నేపథ్యంలో, తిరిగి ఆయన సోదరుడు పెదబాబుకే సర్పంచ్‌ టికెట్‌ ఎలా ఇస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తుండగా, అధికార పార్టీలో మాత్రం తమకు కనీస గుర్తింపు కూడా లేదని పలువురు యువకులు, మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చోడవరం పంచాయతీ సర్పంచ్‌ స్థానం సుమారు 25 ఏళ్ల తర్వాత జనరల్‌ కేటగిరీకి రిజర్వు కావడంతో కాపు సామాజికవర్గానికి చెందిన సకురు కోటేశ్వరరావుకు అవకాశం దక్కుతుందని తొలుత ప్రచారం జరిగింది. ఆయన కూడా సర్పంచ్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకుని పార్టీలో చురుగ్గా పనిచేశారు. అయితే చివరకు బీసీ సామాజికవర్గానికి చెందిన గూనూరు పెదబాబును అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి పదవులన్నీ కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పెదబాబు మద్దతుదారులకు, ఇతర అభ్యర్థుల మద్దతుదారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. వారిని శాంతింపజేసేందుకు ఎమ్మె ల్యే ప్రయత్నించినప్పటికీ, కార్యకర్తలు ఆయనతోనూ వాగ్వివాదానికి దిగారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో అసంతృప్తితో ఉన్న నాయకులు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement