యలమంచిలి రూరల్: యలమంచిలి పంచరాత్రి ఉత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. శుక్రవారం జాతరకు చివరి రోజు కావడంతో గురువారం రాత్రి యలమంచిలి పట్టణానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు. కుటుంబ సమేతంగా జాతర తిలకించడానికి తరలిరావడంతో యలమంచిలి పట్టణంలో రహదారులన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో ప్రధాన రహదారి, అంతర్గత రహదారుల్లో ఏర్పాటు చేసిన సెట్టింగులు జాతర చూడ్డానికి వచ్చేవారికి కనువిందు చేస్తున్నాయి. గురప్ప కల్యాణ మండపంలో ఎగ్జిబిషన్‌కు పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి జెయింట్‌వీల్, రంగులరాట్నం సహా పలురకాల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పిల్లలు ఆటల్లో ఉత్సాహంగా గడుపుతున్నారు. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో జనం జాతర తిలకించడానికి తరలి రావడంతో పట్టణ పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. దీపావళి నుంచి నాగులచవితి వరకు ఐదు రోజులు నిర్వహించే జాతర చివరి రోజు భారీ స్టేజీ ప్రొగ్రాంలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జానపద, సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్టు భూలోకమాంబ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల ఉత్సవ కమిటీల ప్రతినిధులు తెలిపారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
నాగుల చవితితో పంచరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో శుక్రవారం సుమారు లక్ష మందికి పైగా సందర్శకులు జాతరకు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రహదారి, దిమిలి రోడ్డు, తులసీనగర్, పాతవీధి ప్రాంతాల్లో అంతర్గత రహదారుల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నట్టు పోలీసులు తెలిపారు. జాతరకు తరలి వచ్చే వారికి పోలీసులు పలు సూచనలు చేశారు. అనకాపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను చెరుకుకాటా, గోవిందు పెట్రోల్ బంక్ వద్ద, తుని వైపు నుంచి యలమంచిలి వచ్చేవారు యలమంచిలి ఆరంభంలో విజయలక్ష్మి పెట్రోల్ బంక్ వద్ద, అచ్యుతాపురం వైపు నుంచి యలమంచిలి వైపు వచ్చే వారు కల్కి పెట్రోల్ బంక్ వద్ద, ఎస్.రాయవరం నుంచి యలమంచిలి వైపు వచ్చే వారు రామచంద్రమ్మ ఆలయం వద్ద తమ వాహనాలను నిలిపి ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు.


