అక్రమ తవ్వకాలతో అమాంతం పెరిగిన చెరువు లోతు
నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 10 అడుగుల మేర తవ్వకాలు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు యంత్రాంగం
ఉపాధి హామీ కూలీలు, స్థానికులు హెచ్చరించినా ఖాతరు చేయని నేతలు
అదే చెరువులో సరదాగా దిగిన ఇద్దరు విద్యార్థులు.. క్షణాల్లో జలసమాధి
గతంలోనూ ఇదే తరహా అక్రమ తవ్వకాలతో ఇద్దరు విద్యార్థుల మృతి
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
పెందుర్తి/మాకవరపాలెం/ఎస్.రాయవరం: ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా చెరువులో కొందరు నాయకులు రాత్రింబవళ్లు జేసీబీలతో వందలాది లారీల మట్టిని తరలించారు. ఏమిటని ప్రశ్నిస్తే.. మాకు అన్ని అనుమతులూ ఉన్నాయి.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరించేవారు. అన్ని శాఖల అధికారులకూ ఫిర్యాదు చేశాం. మేమే దగ్గరుండి లారీలను, జేసీబీలను పట్టించినా రెవెన్యూ అధికారులు వెంటనే వాటిని విడిచిపెట్టేవారు. దీంతో సదరు టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోయి చెరువు గర్భాన్ని ఇష్టారాజ్యంగా తవ్వి రూ.లక్షలు సంపాదించారు. ఆ లోతు తెలియని ఇద్దరు పిల్లలు చివరకు వారి అక్రమాలకు బలయ్యారు’ అంటూ పినగాడి రెవెన్యూ పరిధిలోని రెడ్డి చెరువు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతంలో విస్తం కళాశాలలో చదువుతున్న పోతల సతీష్ (17), అంగిన ఐజాక్ (17) అనే ఇద్దరు డిప్లొమా విద్యార్థులు నీటిలో మునిగి మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు టీడీపీ నాయకుల ధనదాహమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలే కారణమా?
పినగాడికి చెందిన ఓ టీడీపీ నాయకుడు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిచయాలతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సన్నిహితంగా ఉంటూ చెరువుల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపి విక్రయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం వరకు రెడ్డి చెరువులోనూ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తవ్వకాలు జరిపినట్లు చెబుతున్నారు. ఇదే అదనుగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ అనుచరులు సైతం చెరువులో తవ్వకాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులో అక్కడక్కడా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదకర పరిస్థితి తెలియని విద్యార్థులు నీటిలోకి దిగడంతో లోతు అంచనా వేయలేక క్షణాల్లో మునిగిపోయారు. చివరకు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
గతంలోనూ ఇద్దరు విద్యార్థుల బలి
పినగాడికి చెందిన సదరు టీడీపీ నాయకుడి అక్రమ తవ్వకాల కారణంగా గతంలోనూ ఇదే తరహాలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కోట్నివానిపాలెంలోని నరసింహసాగర్‌లోనూ ఇదే వ్యక్తి అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఓ ప్రైవేటు సంస్థకు గ్రావెల్ విక్రయించేందుకు చెరువు గట్టు సమీపంలోనే భారీ గుంతలు తవ్వినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అదే ఏడాది జూలైలో చెరువులోకి నీరు చేరడంతో కోట్నివానిపాలెంకు చెందిన ఇద్దరు బాలురు లోతు తెలియక నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఇలా పదేళ్ల వ్యవధిలో ఒకే వ్యక్తి సాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ తవ్వకాల కారణంగా నలుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషాదం వెంట విషాదం
పినగాడి రెడ్డి చెరువులో మునిగి మృతి చెందిన సతీష్, ఐజాక్ కుటుంబాల్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. డిప్లొమా విద్యార్థి సతీష్ స్వగ్రామం నర్సీపట్నం సమీపంలోని పోతలూరు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతడి తండ్రి రాజబాబు 15 రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి దశదిన కర్మకు వెళ్లిన సతీష్.. పరీక్షలు జరుగుతుండటంతో రెండు రోజుల క్రితమే తాను ఉంటున్న హాస్టల్‌కు తిరిగి వచ్చాడు. తండ్రి మరణించిన పక్షం రోజులకే కుమారుడు కూడా మృత్యువాత పడటంతో తల్లి లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు ఇదే ప్రమాదంలో మృతి చెందిన ఐజాక్ తల్లి, సోదరి కూడా కొంతకాలం క్రితమే మరణించారు. ఇప్పుడు కుమారుడిని కూడా కోల్పోవడంతో తండ్రి ప్రసాద్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ‘నేను ఎవరి కోసం బతకాలి’ అంటూ కుమారుడి మృతదేహం వద్ద ఆయన విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు తాము ఘటనాస్థలికి చేరుకునేలోపే మృతదేహాలను తరలించడంపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గంమధ్యలో మృతదేహాలతో వెళ్తున్న వాహనాలను చాలాసేపు అడ్డుకున్నారు. తమకు అధికారులు, కళాశాల యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


