అనకాపల్లి : స్థానిక గాంధీనగరంలో ఈ ఏడాది ఆగస్టులో మొల్లిపాక ప్రమీల ఇంటిలో బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేయడం జరిగిందని పట్టణ క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు గురువారం చెప్పారు. వివరాలివి. జిల్లాలో కె.కోటపాడు మండలం గుల్లిపల్లి గ్రామానికి చెందిన(ప్రస్తుతం నివాసి అంజయ్యకాలనీ, గాంధీనగరం నివాసి) పోణకర్లపల్లి నాగేంద్రకుమార్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 24.840 గ్రాములు బంగారం నల్లపూసల తాడు, 8.500 గ్రాములు బంగారం నెక్లెస్, 6.420 గ్రాముల బంగారం చైనుతో కూడిన లాకెట్, 3.140 గ్రాములు బంగారు బ్రాస్లెట్, 2.290 గ్రాములు బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు. నాగేంద్రకుమార్ను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు, టి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.


