పీటముడి! | - | Sakshi
Sakshi News home page

పీటముడి!

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

ఆ రెండు.. ఎంపీపీ పీఠాలపై
జెడ్పీ పీఠంపైనా తొలగని ప్రతిష్టంభన జనసేనకు దక్కకుండా టీడీపీ ఎత్తుగడ తమకే కావాలంటున్న జనసేన శ్రేణులు

సాక్షి, అనకాపల్లి : పరిషత్‌ ఎన్నికల హడావిడి ముగిసిందకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నాడూ లేని రీతిలో 2026 స్థానిక ఎన్నికల పోరు ఏపీలో ఒక యుద్ధాన్నే తలపించాయి. రిజర్వేషన్లను ప్రకటించే దశ నుంచి కౌంటింగ్‌ వరకూ అధికార పార్టీ నేతలు సాగించిన ధ్వంసకాండ, ఏ మాత్రం పట్టించుకోని అధికారుల తీరు చూసి విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపిన ఉదంతాలు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ బాధ్యతాయుతంగా పోటీ చేయాలని భావించిన ప్రతిపక్షం అన్ని రకాల దౌర్జాన్యాలను ప్రతిఘటించింది. బ్యాలెట్‌ పోరులో పోరాట యోధులుగా మిగిలిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, ఇండింపెండెంట్లు, రెబల్స్‌ గర్వంగా ఉన్నారు. పరిషత్‌ ఎన్నికల చివరి అంకానికి మరో వారం పది రోజుల్లో ముగింపు పలకనుంది.

రసవత్తరంగా మారిన పీఠాలు

అనకాపల్లి జిల్లాలో 12 లక్షల పైబడి ఓట్లు ఉండగా, సుమారు 9.50 లక్షల మేరకు ఓట్లు నమోదయ్యాయి.మున్పిపల్‌, కార్పొరేషన్‌, పరిషత్‌ ఎన్నికలకు పోలైన ఓట్లలో అత్యధిక ఓట్లు వైఎస్సార్‌ సీపీకే నమోదు కావడం కొసమెరుపు. సీట్ల పరంగా కూటమిలోని అన్ని పార్టీలు మెజారిటీలో ఉండగా,ఓట్ల పరంగా విడివిడిగా అన్ని పార్టీలకు లభించిన ఓట్లు పరిగణిస్తే వైఎస్సార్‌సీపీకే అత్యధికంగా పడటంతో ఆ పార్టీ శ్రేణులు పోరాటం చేసినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ స్థానిక సంస్థల్లో విజేతలైన అభ్యర్థులు ఇప్పుడు కుర్చీలపై దృష్టి సారించారు. ఈ నెల 19న చేపట్టనున్న ఎంపీపీ ఎన్నికలు, 20న నిర్వహించనున్న జెడ్పీ పీఠాలపై కొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఆ రెండింటిపైనే అందరి దృష్టి...

అనకాపల్లి జిల్లాలో 425 ఎంపీటీసీ సెగ్మెంట్‌లకు ఎన్నికలు జరపగా 75 స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. మరో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో అత్యధికంగా మునగపాక మండలం 8 ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకున్నట్టే కూటమి కూడా అదే మండలంలో 8 స్థానాలను కై వసం చేసుకోవడం ఎంపీపీ పీఠం ఎన్నికపై ఆసక్తిని పెంచింది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీకి 8, జనసేనకు 5, టీడీపీకి 3 స్థానాలు దక్కాయి. దీంతో సమానమైన మెజరిటీ పొందిన అధికార,విపక్ష పార్టీ నేతలు ఇప్పుడు ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు మొదలుపెట్టాయి. గతంలోనూ ఈ మండలంలో చెరో 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినప్పుడు ఒడంబడిన ద్వారా ఐదేళ్ల కాలపరిమితిని పంచుకున్నారు. తాజాగా ఇటువంటి కోణంలోనే పరిణామాలు ఉంటాయని భావించినప్పటికీ ఎంపీటీసీలు అదృశ్యం అయ్యారు. దీంతో రగిలిపోయిన జనసేన నేత అదృశ్యం అయిన ఎంపీటీసీ బంధువును తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. కొన్ని నిఘా వర్గాలు మునగపాక మండల ఎంపీటీసీల ఆచూకీపై అన్ని రకాల సాంకేతిక వనరుల్ని వినియోగించారనే చర్చ సాగుతోంది.అదృశ్యమై ప్రత్యక్షమయ్యిన ఎంపీటీసీకి అండదండగా టీడీపీకీ చెందిన నేత ఉన్నారనేది జనసేన పార్టీ నేత ఆక్రోశంగా తెలుస్తోంది. మరో మండలం అచ్యుతాపురంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలున్న అచ్యుతాపురం మండలంలో అధికంగా జనసేనకు 7, టీడీపీకీ 5, వైఎస్సార్‌ సీపీకి 3(ఒక ఏకగ్రవ స్థానంతో కలిపి),బీజేపీ ఒకటి దక్కించుకోగా, మరో ఐదుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం గమనార్హం. ఇక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థులే కీలకంగా మారారు. జనసేన కోటాలోకి వస్తుందనుకున్న ఎంపీపీ పీఠంపై పీటముడి ఏర్పడింది. జనసేన బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని భావిస్తున్న టీడీపీ కీలక నేత ఇండిపెండెంట్ల సాయంతో టీడీపీకి పీఠం వరించేలా ప్రయత్నిస్తున్నారు. ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలే ఉన్న వైఎస్సార్‌సీపీ జరుగుతున్న పరిణామాల్ని ఆసక్తిగా పరిశీలిస్తుంది.

ప్యాకేజీతో సద్దుమణిగినట్లేనా..?

అచ్యుతాపురం ఎంపీపీ పీఠానికి సంబంధించిన వ్యవహారంపై చక్రం తిప్పుతున్న టీడీపీ నేత గురువారం నాటికి శాంతించారని సమాచారం. ఇప్పటికే ఎంపీపీ పీఠం కోసం రూ.కోటికి పైగా ఖర్చు చేసిన జనసేన అభ్యర్థి మరో యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయాలని ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.కనీసం నామినేషన్‌ వేసినప్పటి నుంచి గెలిచిన తర్వాత గానీ,ఎంపీపీ పీఠం కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు తమను సంప్రదించలేదనే అక్కసు వెలిబుచ్చిన సదరు టీడీపీ నేత ఒక రాజీ ఫార్ములాకు వచ్చారని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మునగపాక మండల పీఠం వ్యవహారంలో తలనొప్పితో ఉన్న జనసేన ప్రతినిది అచ్యుతాపురం విషయంలోనూ ఒత్తిడి గురయ్యారని, దీంతో టీడీపీతో రాజీ ఫార్ములాకు వచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

జెడ్పీ పీఠంపై మరో ప్రచారం...

అనకాపల్లి జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలకు గానూ 17 టీడీపీ, 5 జనసేన, రెండు స్థానాల్ని బీజేపీ దక్కించుకుంది.మెజారిటీ స్థానాల బట్టి టీడీపీకే పీఠం దక్కాల్సి ఉంది. జనసేన ఎమ్మెల్యేల ముగ్గురి ప్రభావం ఉన్న ఈ జిల్లా జెడ్పీ పీఠంపై జనసేన శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు ఇప్పటికే స్పీకర్‌, రాజ్యసభ, మున్సిపల్‌ స్థానాలు దక్కడంతో కనీసం జిల్లాలో మంత్రి స్థానం లేని కాపు సామాజిక వర్గ నేతలు జెడ్పీ పీఠం కావాలని కోరుతున్నారు.అయితే బీసీ మహిళ కు కేటాయించిన ఈ జెడ్పీ పీఠం వచ్చే విషయంలో రిజర్వేషన్ల అంశం కూడా కీలకం కానుంది. తాజాగా జెడ్పీ పీఠంపై గవర సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ పేరు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ అదే పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అడ్డుకునే పనిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షునిగా వ్యవహరించిన ఒక తాజా జెడ్పీటీసీ భర్త తనకున్న బలాన్ని ఉపయోగించి ఎంపీ ద్వారా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతున్నారు. కుర్చీ కోసం లోలోన జరుగుతున్న కుమ్ములాట భవిష్యత్‌లో జిల్లా పరిషత్‌ పరిధిలో జరిగే అభివృద్ధిపై పడుతుందనేది ప్రజల భయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement