మార్చిన రిజర్వేషన్‌ గెజిట్‌కు వ్యతిరేకంగా నిరసన | - | Sakshi
Sakshi News home page

మార్చిన రిజర్వేషన్‌ గెజిట్‌కు వ్యతిరేకంగా నిరసన

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

తుమ్మపాల : స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో గత నెల 15న విడుదల చేసిన సర్పంచ్‌ రిజర్వేషన్ల గెజిట్‌ జాబితాను కూటమి నాయకుల స్వప్రయోజనాల కోసం గోప్యంగా మరో జాబితాను తయారు చేసి 13 గ్రామాల అశావాహులకు తీవ్ర అన్యాయం చేయడం తగదని గురువారం కలెక్టరేట్‌ వద్ద పలు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి మొదటి జాబితానే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అనకాపల్లి మండలంలో దిబ్బపాలెం, రొంగలివానిపాలెం, బవులువాడ, పాపయ్యపాలెం గ్రామస్తులతో పాటు మాజీ ఎంపీపీ గొర్లి సూరిబాబు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణరావుకు కోర్టు పిటిషన్‌ ప్రతులను అందించి న్యాయం చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దాడ రామశంకర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ రిజర్వేషన్లకు సంబంధించి మొదట దిబ్బపాలెం గ్రామానికి అన్‌ రిజర్వ్‌డ్‌గా ప్రకటించి రెండవ జాబితాలో అన్‌రిజర్వ్‌డ్‌ మహిళగా మార్చారని, గోప్యంగా తయారుచేసిన జాబితాను గత నెల 26న మళ్లీ గెజిట్‌ చేసినప్పటికీ 31 వరకు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. మండలంలో బవులువాడ సర్పంచ్‌ అభ్యర్థిగా మహిళను రిజర్వ్‌ చేయాలనే టీడీపీ నేత స్వప్రయోజనాల కోసమే రిజర్వేషన్లు మార్పు చేసినట్టు అధికారులపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయన్నారు. రిజర్వేషన్ల మార్పుపై అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని, జాబితా తయారిలో తన ప్రమేయం లేదని, అప్పుడు సెలవులో ఉన్నట్లు ఎంపీడీవో చెబుతూ తప్పించుకోవడంతో, సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గరపడుతున్నందున మూడు గ్రామాల నుంచి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టులో జరిగిన వాదనలు అనంతరం సంబంధిత అధికారులు స్పందించి పిటిషనర్లకు సరైన స్పష్టత ఇవ్వాలని ఆదేశించిందన్నారు. రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తెలిపిందన్నారు. ఇష్టానుసారం రిజర్వేషన్ల జాబితాను మార్పులు చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ గుడాల సత్యనారాయణ ముదిరాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మొదట విడుదల చేసిన సర్పంచ్‌ రిజర్వేషన్ల ప్రకారం గ్రామాల్లో ఆశావాహులు వ్యయప్రయాసలకోర్చి ప్రచారాలు చేసుకుంటున్న తరుణంలో అర్ధంతరంగా రిజర్వేషన్‌ జాబితాను మార్చడంతో పాటు నాలుగు రోజుల పాటు గోప్యంగా ఉంచడంతో 13 గ్రామాల్లో ఆశావాహులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు దొంగచాటుగా రిజర్వేషన్లు మార్చడంపై జిల్లా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యంపై భయం భక్తి లేకుండా గెజిట్‌ను సైతం మార్చేసేంతగా మండల అధికారులు తయారయ్యారన్నారు. బవులువాడలో ఎస్సీగా వచ్చిన రిజర్వేషన్‌ను మార్చేసి మా హక్కులను ఆక్రమించుకోవడం అత్యంత దారుణమన్నారు. దీనిపై సంబంధిత అన్ని స్థాయిల అఽధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ పట్టించుకోకుండా మార్చిన జాబితాతో ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమవుతుండడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఇచ్చిన ఆదేశాలను కలెక్టరేట్‌లో సమర్పించామన్నారు. కార్యక్రమంలో జోయల్‌ మనోహర్‌, రొంగళి మహలక్ష్మి, బుజ్జి, కె.ఎల్‌ నాయుడు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement