చూపు లేకపోయినా.. లక్ష్యంపై గురి తప్పలేదు. అడుగడుగునా సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పరుగెత్తారు. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటుతూ రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. అంధత్వం తన విజయానికి అడ్డుకాదని నిరూపిస్తూ.. గిరిజన ప్రాంతం నుంచి జపాన్ వరకు విజయపతాక ఎగురవేసిన ఆ క్రీడాకారిణే వలసనైని రావణ్ణి.
సాక్షి, పాడేరు: అంధురాలైన గిరిజన క్రీడాకారిణి వలసనైని రావణ్ణి జపాన్‌లో ఇటీవల జరిగిన 5వ ఆసియా పారా క్రీడా పోటీల్లో సత్తా చాటారు. గతంలో అంధుల మహిళా క్రికెట్లో రాణించిన ఆమె.. ఈసారి అథ్లెటిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి గిరిజన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.
రావణ్ణి 400 మీటర్ల పరుగు పోటీలో ఒక నిమిషం 3.64 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం సాధించారు. అలాగే 1,500 మీటర్ల పరుగును 5 నిమిషాల 41.64 సెకన్లలో పూర్తి చేసి మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 200 మీటర్ల పరుగులోనూ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. అంతర్జాతీయ వేదికపై రెండు కాంస్య పతకాలు సాధించి భారతదేశంతో పాటు అల్లూరి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు. అనేక సవాళ్లను అధిగమించి ఆసియా పారా క్రీడలకు రావణ్ణి ఎంపికయ్యారని ఆమె గైడ్ రన్నర్ తబ్రేజ్‌ఖాన్ తెలిపారు. గతంలో 120 మందికి పైగా అథ్లెట్లకు అందుబాటులో ఉన్న కోటా స్థానాలను ఈసారి 60కి తగ్గించినప్పటికీ.. తన ప్రతిభతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం విశేషమన్నారు.
కలెక్టర్ ఘన సన్మానం
హుకుంపేట మండలం రంగిసింగిపాడు గ్రామానికి చెందిన రావణ్ణి క్రికెట్, అథ్లెటిక్స్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పారా క్రీడా పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన ఆమెను కలెక్టరేట్లో కలెక్టర్ టి.నిశాంతి ఘనంగా సత్కరించారు. దుశ్శాలువాలు కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రావణ్ణి రెండు కాంస్య పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతికూల పరిస్థితులు, శారీరక పరిమితులు, ఆర్థిక ఇబ్బందులు విజయానికి అడ్డంకులు కావని రావణ్ణి తన క్రీడా ప్రస్థానం ద్వారా నిరూపించారన్నారు. రావణ్ణి వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజంతో పాటు ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా శిక్షణ, అవసరమైన సదుపాయాల కోసం తనను సంప్రదించాలని సూచించారు.
అంధత్వాన్ని జయించి..ఆసియా వేదికపై మెరిసి!
పరుగులో పతకాల పంట
గిరిజన బిడ్డకు అంతర్జాతీయ కీర్తి
క్రికెట్‌తోపాటు అథ్లెటిక్స్లోను రాణిస్తున్న రావణ్ణి


