సాక్షి, విశాఖపట్నం : పెట్టుబడిదారులకు భారత్ ఎడారిలో ఒయాసిస్‌లా కనిపిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత జీడీపీ వృద్ధిలో విదేశీ పెట్టుబడులతోపాటు నైపుణ్యం కలిగిన యువత కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. విశాఖ నగరం స్టీల్ సిటీ నుంచి సిలికాన్ సిటీగా ఎదుగుతోందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విశాఖలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి హాజరైన పారిశ్రామిక ప్రతినిధులు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు అనువైన రంగాలను తెలియజేస్తూ కీలక ప్రతిపాదనలు చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు రియల్ టైమ్‌లో అనుమతులు, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలను వేగంగా అందిస్తున్నామని వివరించారు.
సీఐఐ సదస్సును ప్రారంభించిన
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్


