అనకాపల్లి : మండలంలో శంకరం పంచాయతీ పరిధిలో పర్యాటక కేంద్రమైన బొజ్జనకొండకు కార్తీకమాసంలో పర్యాటకుల సౌలభ్యం కోసం బొజ్జన్నకొండ ఆర్చ్ వద్ద బస్టాప్‌ను ఏర్పాటు చేయాలని సిద్దార్ధా సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు బల్లా నాగభూషణం కోరారు. జిల్లా ప్రజారవాణాశాఖ కార్యాలయంలో శాఖ అధికారి వి.ప్రవీణకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ పర్యాటక బౌద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం బొజ్జన్నకొండ అందాలను, బౌద్ద శిల్ప కళాసంపదను, భగవాన్ బుద్ధుని ఆరాధనలకు గాను సందర్శించుటకు కొన్ని వేల మంది దేశ, విదేశీ పర్యాటకులు, దేశ విదేశీ బౌద్ద భిక్షువులు రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్‌లకు స్టాప్‌ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు వినకోట నీలేష్గుప్తా, రొబ్బి మల్లేశ్వరరావు, బొడ్డు సోమరాజు, కాపారపు సత్యనారాయణ పాల్గొన్నారు.


