సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సింహగిరిపై ఏఐ ఆధారిత క్యూఆర్ కోడ్ సమాచార బోర్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర పర్యాటకశాఖ చొరవతో ఎక్స్‌ప్లర్జర్ సాంకేతిక సహకారంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆలయ చరిత్ర, దర్శన వేళలు, సేవలు తదితర వివరాలు తెలుసుకోవచ్చని ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. భక్తులకు మరింత వేగవంతమైన సమాచారం, సేవలు అందించేందుకు ఈ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’ సేవలను కూడా అనుసంధానించినట్టు పేర్కొన్నారు. 95523 00009 నెంబరు ద్వారా వివిధ సేవా టిక్కెట్లు, దర్శనాల టిక్కెట్లు పొందే సదుపాయం కల్పించినట్టు తెలియజేశారు.


