ప్రాదేశిక పోరుకు నేడు తెర..! | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక పోరుకు నేడు తెర..!

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఏడు ప్రాంతాల్లో 10 కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు

24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

జెడ్పీటీసీ బరిలో 80 మంది..

ఎంపీటీసీ బరిలో 979 మంది

జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న 9,33,423 మంది

స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన ఎన్నికల అధికారులు

స్థానిక సంస్థల ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. శనివారం పరిషత్‌ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు జరగనుండడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ ముగిసి కౌంటింగ్‌కు ఒకరోజు విరామం రావడంతో గెలుపోటములపై అభ్యర్థులు తమ అంచనాల్లో మునిగిపోయారు. ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో కౌంటింగ్‌ కేంద్రాలు

లెక్కింపు కేంద్రం మండలాల కేటాయింపు

ఏఎంఏఏఎల్‌ అనకాపల్లి, బుచ్చెయ్యపేట,కళాశాల, కొత్తూరు, కశింకోట, మునగపాకఅనకాపల్లి పరవాడ, సబ్బవరం,

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చోడవరంగాంధీగ్రాం, చోడవరం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, దేవరాపల్లిగురుకులం(బాయ్స్‌), తెనుగుపూడి, కె.కోటపాడు దేవరాపల్లి మండలం

ప్రభుత్వ జూనియర్‌ నక్కపల్లికళాశాల, నక్కపల్లి

జిల్లా పరిషత్‌ ఉన్నత పాయకరావుపేటపాఠశాల, నక్కపల్లి ఎస్‌.రాయవరం

డాన్‌ బాస్కో డిగ్రీ, మాకవరపాలెం,పీజీ కళాశాల, నర్సీపట్నంపెదబొడ్డేపల్లి రోలుగుంటనర్సీపట్నం

ప్రభుత్వ కోటవురట్ల, డిగ్రీ కళాశాల, గొలుగొండ, నర్సీపట్నం నాతవరం, రావికమతం

సెయింట్‌ ఆన్స్‌ వి.మాడుగులఇంగ్లిష్‌ మీడియం చీడికాడస్కూల్‌, వి.మాడుగుల

ఇండోర్‌ స్టేడియం, అచ్యుతాపురంయలమంచిలి రాంబిల్లి

ఎస్‌జీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్‌సీసీ షెడ్‌, యలమంచిలియలమంచిలి

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాల కోసం 80 మంది, ఎంపీటీసీ స్థానాల కోసం 979 మంది పోటీ పడ్డారు. మరో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో మొత్తం 1,530 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 9,33,423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 75.58 శాతం పోలింగ్‌ నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికలతో పోలిస్తే పరిషత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడంతో వివిధ పార్టీల అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఓటర్ల అసలు తీర్పు కౌంటింగ్‌తోనే వెల్లడికానుంది. దీంతో ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలిసారి అనకాపల్లి జెడ్పీ పీఠంతో పాటు ఆయా మండలాల్లో ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించాయి. మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో శ్రమించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులకు పీవోలు, ఏపీవోల సమక్షంలో సీల్‌ వేసి, రూట్‌ అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.

పది కౌంటింగ్‌ కేంద్రాలు

పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కౌంటింగ్‌ కేంద్రాలపై పడింది. జిల్లాలో ఏడు ప్రాంతాల్లో 10 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల సీల్స్‌ను ఎన్నికల అధికారులు శుక్రవారం పరిశీలించారు. కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల వద్ద భద్రత, కౌంటింగ్‌ సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు

మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక కౌంటింగ్‌ టేబుళ్లు, కౌంటర్లను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో అవసరమైన సిబ్బందిని నియమించి, లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి రౌండ్‌లో లెక్కింపు పూర్తయిన అనంతరం సంబంధిత వివరాలను అధికారికంగా నమోదు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థుల తరఫున నియమితులైన కౌంటింగ్‌ ఏజెంట్లు నిబంధనలకు లోబడి లెక్కింపు ప్రక్రియను పరిశీలించే అవకాశం కల్పించనున్నారు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఫలితాల ప్రకటన వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు.

మూడంచెల భద్రతా వ్యవస్థ

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ పరిసరాల్లో మొదటి భద్రతా వలయం, కౌంటింగ్‌ కేంద్రం ప్రవేశ ద్వారాల వద్ద రెండో వలయం, కౌంటింగ్‌ హాళ్ల వద్ద మూడో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. పోలీసుల అనుమతి ఉన్న అధికారులు, సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు మాత్రమే నిబంధనల ప్రకారం లోపలికి ప్రవేశం కల్పించనున్నారు. సెల్‌ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఎన్నికల నిబంధనల ప్రకారం ఆంక్షలు అమలు చేయనున్నారు. కళాశాల పరిసరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అనుమతి లేని వ్యక్తులు కౌంటింగ్‌ కేంద్రం వైపు రాకుండా బందోబస్తు నిర్వహించనున్నారు.

పాయకరావుపేటలో ఘర్షణలపై ఆందోళన

హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో పరిషత్‌ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు ఓటర్లలో ఆందోళన కలిగించాయి. నక్కపల్లి మండలం గొడిచర్ల వద్ద ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను కూటమి నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. నక్కపల్లి ఉన్నత పాఠశాల వద్ద కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అదే విధంగా బుచ్చెయ్యపేట మండలం తురకలపూడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై కూటమి నేతలు దాడి చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల పరిరక్షణపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏఎంఏఏఎల్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌లో సీళ్లతో భద్రపరచిన బ్యాలెట్‌ బాక్స్‌లు

ఏఎంఏఏఎల్‌లో ఏర్పాటు చేసిన కశింకోట కౌంటింగ్‌ శిబిరం

జిల్లాలోని 13 పంచాయతీలకు రిజర్వేషన్లు మార్చడంతో పలు గ్రామాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో రొంగలివానిపాలెం గ్రామస్తులు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ పోలింగ్‌ జరగలేదు. అయితే అనధికారికంగా ఇద్దరు ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ రీపోలింగ్‌ నిర్వహిస్తారా? లేక పోలింగ్‌ ప్రక్రియను పూర్తయినట్లుగా పరిగణిస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో అధికారులు వివరాలను వెల్లడించడం లేదనే ప్రచారం సాగుతోంది. రొంగలివానిపాలెం పోలింగ్‌ కేంద్రం కుంచంగి ఎంపీటీసీ సెగ్మెంట్‌ పరిధిలో ఉండటంతో అక్కడి అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ సెగ్మెంట్‌కు శనివారం కౌంటింగ్‌ నిర్వహిస్తారా? లేదా? అన్న అంశంపైనా స్పష్టత కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

అచ్చర్లలో ఓట్ల వ్యత్యాసంపై వివాదం

కశింకోట మండలం మోసయ్యపేట సెగ్మెంట్‌ పరిధిలోని అచ్చర్లలో ఓట్ల వ్యత్యాసం వివాదానికి దారితీసింది. ఎంపీటీసీ అభ్యర్థికి నమోదైన ఓట్ల సంఖ్యతో పోలిస్తే జెడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించిన స్లిప్పుల సంఖ్య ఆరు అధికంగా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సుమారు నాలుగు గంటలపాటు ఎన్నికల అధికారులను స్థానికులు నిలదీశారు. ఏజెంట్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా, సీల్‌ వేయకుండానే బ్యాలెట్‌ బాక్సులను తరలించారు. ఓట్ల వ్యత్యాసంపై ఎన్నికల సిబ్బంది ఇచ్చిన వివరణలు మరింత సందేహాలకు తావిచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత పీవో, ఏపీవోలపై శుక్రవారం ఫిర్యాదు చేశారు. జరిగిన పొరపాట్లపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే రీపోలింగ్‌ నిర్వహించాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు వద్ద స్థానికేతరులుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులు కనిపించడం మరో వివాదానికి దారితీసింది. తాము కాకినాడకు చెందినవారమని, డబ్బులు, బిర్యానీ ఇస్తామని చెప్పడంతో వచ్చామని వారు వెల్లడించడంతో ఇక్కడ రిగ్గింగ్‌కు ప్లాన్‌ చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.

రొంగలివానిపాలెంపై వీడని సందిగ్ధత

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement