బీచ్‌రోడ్డు: పర్యాటక ప్రియులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది. విశాఖ నుంచి దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) రెండు ప్రత్యేక విమాన టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కర్ణాటక తీర ప్రాంతాలతో పాటు ఈశాన్య భారతంలోని ప్రకృతి అందాలకు నెలవైన మేఘాలయ, అస్సాం రాష్ట్రాలను సందర్శించేలా ఈ ప్యాకేజీలను రూపొందించింది. వీటి బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌సీటీసీ చీఫ్ సూపర్‌వైజర్ రామచంద్ర కుమార్ పర్యాటక ప్యాకేజీల వివరాలను వెల్లడించారు. మొదటి ప్యాకేజీగా ‘కోస్టల్ కారిడార్ ఆఫ్ కర్ణాటక’ పేరుతో ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటనను ఏర్పాటు చేశారు. నవంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ టూర్‌లో ఉడిపి, గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, మంగళూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీకి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.57,450, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.46,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.44,600 చొప్పున ధరలను నిర్ణయించారు. రెండో ప్యాకేజీగా ‘క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం’ పేరుతో ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల పర్యటనను ప్రకటించారు. డిసెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ టూర్‌లో షిల్లాంగ్, చిరపుంజి, కాజిరంగా, గౌహతి తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ ప్యాకేజీకి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.75,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.62,150, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.58,550 చొప్పున ఛార్జీలను నిర్ణయించారు.బుకింగ్‌లు, పూర్తి వివరాల కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్ నంబర్–1 వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలు, ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం www. irctctourism. com వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.


