దేవరాపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అధికారులను ఆదేశించారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యాలయంలో దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలకు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆర్డీవో వై.శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. రెండు మండలాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లు, ఓట్ల లెక్కింపు టేబుళ్లు, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎస్.మంజులవాణి, కె.శ్రీదేవికి సూచించారు. రౌండ్ల వారీగా వెలువడే ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు బయట మీడియా పాయింట్‌తో పాటు స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్వోలు మంజులవాణి, శ్రీదేవి, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్ పాల్గొన్నారు.


