పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

● ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

తుమ్మపాల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శుక్రవారం సాయంత్రం ఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఒక గది నుంచి మరో గదికి బ్యాలెట్‌ బాక్సులను తరలించేటప్పుడు సంబంధిత ఆర్వో, ఏఆర్వో, పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని ఆదేశించారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో పురుష, మహిళా పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించాలని సూచించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్వోలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో అంతర్గత ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

● అనకాపల్లి ఏఎంఏఏఎల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్‌ గురువారం రాత్రి పరిశీలించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్‌ బాక్సుల భద్రత, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement