తాటిచెట్లపాలెం: దీపావళి పండగ సీజన్ కావడంతో ప్రయాణికులు తెలిసో, తెలియకో మందుగుండు, మండే స్వభావం కలిగిన పదార్థాలను రైళ్లలో తమ వెంట తీసుకెళ్తున్నారని,ఇది ప్రమాదకరమని, నేరమని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. పండుగ వేళల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు కుటుంబాలతో కలిసి సొంత ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారని, వారి ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీజన్‌లో రైళ్లు రద్దీగా ఉండే నేపథ్యంలో టపాసులు, మందుగుండు సామగ్రి, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, పెట్రోల్, కిరోసిన్ వంటి ప్రమాదకర వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.వెయ్యి వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి వస్తువులను తీసుకెళ్తున్నట్లు గుర్తిస్తే రైల్వే అధికారులు, సిబ్బందికి లేదా 139 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు, నిరంతర తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


