అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అధికారులకు స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తాం: కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
మహారాణిపేట: విశాఖ వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే దేశ, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌తో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలు, స్థానిక విశేషాలను పరిచయం చేసేలా ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్‌లు రూపొందించాలన్నారు. అతిథుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయంలో ప్రత్యేక రిసెప్షన్ డెస్క్, స్వాగత బృందాన్ని ఏర్పాటు చేయాలని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అతిథులకు ఘన స్వాగతం పలకాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సమీక్షలో సీపీ శంఖబ్రత బాగ్చి, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈడీబీ సీఈవో సాన్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్, ఎండీ దినేష్ కుమార్, సెర్ప్ సీఈవో కరుణ, జీసీసీ ఎండీ శోభిక, జేసీ విద్యాధరి, అధికారులు గీతాంజలి శర్మ, గెడ్డం శేఖర్‌బాబు, డీసీపీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
డాబాగార్డెన్స్: ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల వివరాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆయనకు వివరించారు. అన్ని పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


