ఫ్లెక్సీ మారుస్తూ విద్యుత్‌ షాక్‌.. టైలర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ మారుస్తూ విద్యుత్‌ షాక్‌.. టైలర్‌ మృతి

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

మధురవాడ: హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ ఓ టైలర్‌ ప్రాణాన్ని బలిగొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషాద ఘటన మధురవాడ కళానగర్‌లో చోటుచేసుకుంది.స్థానికులు, పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళానగర్‌కు చెందిన ఉరుకూటి భాస్కరరావు (44) గత 30 ఏళ్లుగా టైలర్‌గా పనిచేస్తూ అందరికీ సుపరిచితుడిగా ఉన్నాడు. కొన్నేళ్లుగా మధురవాడ మెయిన్‌ రోడ్డులో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న కొల్లి కాంప్లెక్స్‌లో టైలరింగ్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటికి సామాన్లు ఇచ్చి తిరిగి దుకాణానికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో భార్య సునీత ఫోన్‌ చేయగా, పని ముగించుకుని వస్తానని చెప్పాడు. అనంతరం దుకాణం మూసివేసి, షాపుపై ఉన్న ఫ్లెక్సీని మార్చేందుకు మేడపైకి వెళ్లాడు.ఇనుప రాడ్లతో ఉన్న ఫ్లెక్సీని తొలగించే క్రమంలో పైన ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను సంప్రదించారు. అతనితో కలిసి పనిచేసే శంకర్‌కు ఫోన్‌ చేయగా.. ఉదయం దుకాణం వద్దకు వచ్చి ఫోన్‌ చేయడంతో మేడపై రింగ్‌ వినిపించింది.అనుమానంతో పైకి వెళ్లి చూడగా ఫ్లెక్సీ కింద భాస్కరరావు మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల సమాచారంతో పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ పెద్దను కోల్పోయి..

భాస్కరరావు మృతితో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. మృతుడికి భార్య సునీతతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement