అనకాపల్లి: దీపావళి పండగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అగ్నిప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ గోదాములు, తాత్కాలిక విక్రయ దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాల అమలుపై విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాణసంచా నిల్వలు, విక్రయాలు చేపట్టే వ్యాపారులు సంబంధిత శాఖల నుంచి ముందస్తుగా తాత్కాలిక లైసెన్సులు పొందాలని సూచించారు. అధీకృత హోల్‌సేల్ వ్యాపారుల వద్ద నుంచే బాణసంచా కొనుగోలు చేయాలన్నారు. నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు దూరంగా పట్టణ, గ్రామీణ శివార్లలోని ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత తగ్గించేందుకు రెండు దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల దూరం ఉండాలన్నారు. ప్రతి దుకాణం వద్ద తగినంత నీరు, పొడి ఇసుక బస్తాలు, నిబంధనలకు అనుగుణమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజా రవాణా వాహనాలు, ప్రయాణికులు ప్రయాణించే వాహనాల్లో బాణసంచా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. బాణసంచా నిల్వ గోదాముల్లో షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేయాలని, ఫైర్ అలారమ్‌లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో సులభంగా బయటకు వెళ్లేందుకు రాకపోకలకు వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


