సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో అర్నబ్ తుఫాన్ ప్రభావం మూడో రోజూ కొనసాగింది. మొదటి రెండు రోజులు కలిపి జిల్లాలో సరాసరిన 179.9 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో రిజర్వాయర్లు అన్నీ నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంతో అప్పటికే పడిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, గెడ్డలు,సాగు నీటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శారద, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి. 3.139 హెక్టార్లలో వరి, 19 హెక్టార్లలో చెరకు ముంపునకు గురయ్యింది. నక్కపల్లి మండలంలో 54 బోట్లు, పాయకరావుపేట మండలంలో 24 బోట్లు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 63 రోడ్లు ధ్వంసం కావడంతో సుమారు 26.87 కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. జిల్లాలో 89 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం జిల్లాకు రెండు కోట్ల ఐదు లక్షల ఐదు వేల రూపాయల్ని కలెక్టర్ విజయ్‌కృష్ణన్ విడుదల చేశారు. నర్సీపట్నం పరిధిలోని పెద్దబొడ్డేపల్లి వద్ద పొంగిన చెరువుని, గన్నవరం మెట్ట వద్ద వెదుళ్ల గెడ్డ పూడిక తీత పనుల్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు.
రాకపోకలు బంద్...
జిల్లాలోని చాలా చోట్ల సాగునీటి కాలువలు, ఇతరత్రా సాగునీటి వ్యవస్థలు ఉప్పొంగడంతో రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. వడ్డాది–పాడేరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దేరు నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం అయ్యారు. బొడ్డేరు నదిలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వర్షం నష్టాలపై తక్షణ చర్యలు చేపట్టాలి
తుమ్మపాల : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జలాశయాలు, సాగునీటి చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, పంట నష్టాలను అంచనా వేసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను 48 గంటల్లో పూర్తి చేయాలని, విద్యుత్, తాగునీటి సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆదేశించారు. చెరువుల గేట్లు, లీకేజీలు, మిగులు నీటి కాలువలను తనిఖీ చేయాలని సూచించారు. ఈదురుగాలులకు దెబ్బతిన్న సుమారు 200 హెక్టార్ల ఉద్యాన పంటల నష్టాన్ని సచివాలయాల వారీగా అంచనా వేయాలని ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
జిల్లాలో సరాసరి 179.9 మి.మీ వర్షపాతం నమోదు 63 రోడ్లు ధ్వంసం..రూ.26.87 కోట్ల ఆస్తినష్టం సహాయక చర్యలకు రూ.2.05 కోట్లు విడుదల చేసిన కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటన


