అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అంకంరెడ్డి సౌమ్య (నాతవరం మండలం జెడ్పీటీసీ అభ్యర్థిని)ను మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, జిల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల తీర్మానం మేరకు ప్రకటించడం జరిగిందని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భయపడిపోయి అభ్యర్థులను ప్రకటించలేకపోతుందని అన్నారు. బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలు, ప్రముఖ గైనకాలజిస్టు వైద్యురాలు సౌమ్యను నూతన జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల జిల్లాలో సమస్యల పరిష్కరానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ 24 మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులకు ఆయా ప్రాంతాల ప్రజల ఆశ్వీరాదంతో గెలుపు ఖాయమన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో 25 కేజీల బియ్యం బస్తా రూ.2200లకు పెరగడమే కాకుండా నిత్యావసర ధరలను ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం కనబడడం లేదన్నారు. గృహాలకు విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచి కూటమి రెండేళ్ల పాలనలో ప్రజల నడ్డి విరిచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి బస్టాపుల్లో బస్సులు ఆగకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందన్నారు. సూపర్‌సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు, ప్రతి మహిళకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు 50 సంవత్సరాలకే ప్రభుత్వ పింఛన్ వంటి అనేక పథకాలు అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సుగర్‌ఫ్యాక్టరీలను మూసివేసి, రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎంపీ సీఎం రమేష్ కొండలను పిండిచేసి దోచుకున్నా సీఎంకు చలనం లేకుండా పోయిందన్నారు.
మాజీ మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ అధికారులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలను పారద్శకంగా నిర్వహించాలని, రాజ్యాంగం కల్పించిన ఓటును ఓటర్ స్వేచ్ఛగా వేసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనకు, సీఎం చంద్రబాబు పాలనకు తేడా ప్రజలు గమనించారని, సరైన సమయంలో ప్రజలు ఓటు ద్వారా కూటమికి బుద్ధి చెపుతారని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌సిక్స్ పథకాలపై బూటకపు హామీలతో మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు స్థానిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు భరత్‌కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్‌వర్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


