నామినేషన్ వేసి పరువు పోగొట్టుకున్న బడా బాబులు
టీడీపీ జిల్లా అధ్యక్షునికి మొండిచేయి
ఉమ్మడి జిల్లా టీడీపీలో సేవలందించిన లాలం కుటుంబానికి అన్యాయం
జనసేన ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జికి తప్పని షాక్
బీజేపీకి రెండు సీట్లతో సరి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ పీఠం ఆశించి కూటమిలోని కీలక నేతలు భంగపడ్డారు. జిల్లాలోని ఆయా పార్టీల అగ్రనేతలకే దిక్కులేకపోతే తమ పరిస్థితేంటంటూ ద్వితీయ శ్రేణి, సామాన్య కార్యకర్తలు మదనపడిపోతున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా 24 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 17 సీట్లు టీడీపీకి, 5 సీట్లు జనసేనకు కేటాయించగా, బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు, పవన్ ద్వయం బీజేపీకి పట్టు రాకుండా వ్యూహం పన్నుతున్నారనేందుకు సీట్ల కేటాయింపే మచ్చుతునకని రాజకీయ విమర్శలు వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందంగా మారింది. జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ విషయంలో టీడీపీకి చెందిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టించారని రగిలిపోతుంటే, జెడ్పీ చైర్మన్ సీటు ఆశించిన ఆయన చివరికి జెడ్పీటీసీగా పోటీ చేయకుండా నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. జిల్లాలోని చాలా చోట్ల టీడీపీ నాయకులు జెడ్పీటీసీ సీట్లు ఆశించి భంగపడ్డారు. జిల్లాలో ఓ వెలుగు వెలిగిన దివంగత లాలం భాస్కర్ కుటుంబానికి అన్యాయం జరిగిందని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు.
ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని లాలం భవానీ కుటుంబీకులు విజయవాడ స్థాయిలో పరపతి ప్రయోగించారు. అయితే జెడ్పీటీసీగా వేసిన నామినేషన్‌నే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. రాంబిల్లి మండలానికి చెందిన లాలం కుటుంబానికి ఎలాగైనా పదవి రప్పించాలనే యోచనతో మాజీ ఎంపీ, స్థానిక నియోజక వర్గ టీడీపీ ఇన్‌ఛార్జిలు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లాలం భవానీ బంధువు పక్క మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని నామినేషన్ వేసినప్పటికీ సీటు రాకుండా పోయింది. సర్దుబాటు కింద తమని తీవ్రంగా అవమానించారని లాలం అభిమానులు చిర్రుబుర్రులాడుతున్నారు.
సర్దుబాటు కోటాలో వస్తుందని ఆశపడి..
జెడ్పీటీసీలకు నామినేషన్‌లు వేసే చివరి రోజుకు ముందు రాత్రి జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న సుందరపు సతీష్‌కు దయనీయ పరిస్థితి ఎదురైంది. జెడ్పీ చైర్మన్ సర్దుబాటు కోటాలో అనకాపల్లి జిల్లాకి కేటాయించారని, తమకే జెడ్పీ పీఠం ఖరారు అయ్యిందనే స్థాయిలో ప్రచారం చేయించారు. దీంతో రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో సతీష్ సతీమణి నామినేషన్ వేశారు. చివరకు జెడ్పీ చైర్మన్ పీఠం మాట దేవుడెరుగు జెడ్పీటీసీగా పోటీ చేయకుండా నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
బీజేపీకి రిక్తహస్తం..
24 జెడ్పీటీసీ స్థానాలు ఉన్న జిల్లాలో రెండంటే రెండు సీట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి. ఎంపీ సీఎం రమేష్ బీజేపీ కంటే టీడీపీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. యలమంచిలి నియోజక వర్గ బీజేపీ ప్రతినిధిగా నియమితులై జోరుగా ఉన్న అచ్యుతాపురం మండల నేత జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎంపీ సీఎం రమేష్‌ని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. సీట్ల సర్దుబాటులో అచ్యుతాపురం బీజేపీ నేతకు రిక్త హస్తం ఎదరయ్యింది. జిల్లాలోని కశింకోట, పాయకరావుపేట మండలాలకే బీజేపీ సీట్లు కేటాయించారు.


