చెరువులు, ముంపు ప్రాంతాల పరిశీలన ● పంట నష్టం నివారణకు ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

చెరువులు, ముంపు ప్రాంతాల పరిశీలన ● పంట నష్టం నివారణకు ఆదేశాలు

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

నర్సీపట్నం/నాతవరం/మాడుగులరూరల్‌: అర్నబ్‌ తుపాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ గురువారం నర్సీపట్నం, నాతవరం, మాడుగుల మండలాల్లో పర్యటించి చెరువులు, రిజర్వాయర్లు, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లి చెరువును పరిశీలించిన కలెక్టర్‌.. జిల్లాలోని నీటిపారుదల చెరువుల గేట్లు, లీకేజీలను సరిచేయాలని సూచించారు. పెద్దేరు రిజర్వాయర్‌ నుంచి 3 వేల క్యూసెక్కులు, కోనాం రిజర్వాయర్‌ నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లలో నీటి రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టం నివారణకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వెదుళ్లగెడ్డను కలెక్టర్‌ పరిశీలించారు. వరద కారణంగా రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిన నేపథ్యంలో గెడ్డకు ఇరువైపులా తాత్కాలిక రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని, ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిదిమ్మలను తొలగించాలని సూచించారు. నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి, నిల్వ నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరి, అరటి, కూరగాయల పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు.

మాడుగుల మండలం పోతనపూడి, వీరవల్లి అగ్రహారం గ్రామాల్లోనూ కలెక్టర్‌ పర్యటించారు. చుట్టిగెడ్డ, శారదా నది ప్రవాహంతో ముంపునకు గురైన పంట పొలాలను, గెడ్డ గట్టుకు పడిన గండిని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకుని, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పర్యటనల్లో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement