బీభత్సం | - | Sakshi
Sakshi News home page

బీభత్సం

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

అర్నబ్‌
జిల్లా అతలాకుతలం
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన
సహాయక బృందాలకు ఎస్పీ సూచనలు

పారిశుధ్య చర్యలుపర్యవేక్షించిన డీపీవో

అచ్యుతాపురం రూరల్‌: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైన పంచాయతీల్లో భాగంగా బుధవారం అచ్యుతాపురంలో డీపీఓ కిరణ్‌ కుమార్‌ విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. తుపాను అనంతరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్య పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ బాబూరావు, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు.

సాక్షి, అనకాపల్లి: అర్నాబ్‌ ప్రభావంతో అనకాపల్లి జిల్లా అతలాకుతలమవుతోంది.బుధవారం తెల్లవారు జామున తుఫాన్‌ తీరం తాకే ప్రక్రియతో పాటు,దాటే దశ కొనసాగడంతో ఈ జిల్లాలో ఆ ప్రభావం గట్టిగా కనిపించింది.జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కావడం,బలమైన ఈదురు గాలులు వీయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.మంగళవారం ఉదయం 08:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ జిల్లాలో సరాసరిన 150.3 మి.మీల వర్షపాతం నమోదయ్యింది.జిల్లాలో అత్యధికంగా కశింకోట మండలం కన్నూరుపాలెం పరిసరాల్లో 265 మి.మీల వర్షపాతం నమోదయ్యింది.భారీ వర్షాల కారణంగా జిల్లా తడిసిముద్దయ్యింది.ఒక్కసారిగా వాగులు,వంకలు పొంగాయి.పెద్దేరు జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.విజయరామరాజుపేట దాచేరు వంతెనపై వరద నీరు చేరడంతో పాడేరు,అనకాపల్లి,నర్సీపట్నం ప్రాంతాలకు చేరే వాహనాలు నిలిచిపోయాయి.వడ్డాది పెద్దేరు డైవర్సన్‌ రోడ్డుపై వరదనీరు చేరడంతో రవాణా స్తంభించింది.నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లగెడ్డ ఉప్పొంగడంతో తుని–నర్సీపట్నం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.ఎస్‌ రాయవరం మండలంలో వరహా నది ఉప్పొంగి ప్రవహించడంతో ఎస్‌ రాయవరం–లింగరాజుపాలెం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఇదే మండలంలో ర్యాలీ కాలనీలో వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అడ్డురోడ్డు ఆర్డీవో కాలనీకి సమీపంలోని తిమ్మాపురం ఎస్‌సీ కాలనీలో నీరు చేరింది.యలమంచిలి పట్టణంలో ఈదురుగాలులకు నేలపై పడిన విద్యుత్‌ వైర్లు తగలడంతో నున్న భాగ్యలక్ష్మి(55) అనే మహిళ మృతి చెందారు. అచ్యుతాపురం మండలంలోని ఉద్ధపాలెంలోని రాజాన లక్ష్మి పూరింట్లోకి కొండ చిలువ దూరడంతో ఇంటిలో ఉన్న భయాందోళనకు గురయ్యారు. స్కేక్‌ క్యాచర్‌ సాయంతో కొండ చిలువను పట్టుకున్నారు. చోడవరం మండలంలోని గంధవరం వద్ద రోడ్డుపై వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారుల పర్యటన...

ఒకవైపు స్థానిక ఎన్నికల హడావిడిలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్రతతో అప్రమత్తం అయ్యారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చోడవరం మండలంలోని భోగాపురం వద్ద గల పెద్దేరు–శారదా నది కలయిక ప్రాంతం వద్ద వరద ఉధృతిని పరిశీలించారు.అదే మండలంలోని గంధవరం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. చోడవరం మండలంలోని వెంకన్నపాలెం వద్ద సబ్‌స్టేషన్‌ను, అనకాపల్లి మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనకాపల్లి పట్టణంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన అండర్‌ బ్రిడ్జి వద్ద చేరుకున్న వర్షపు నీటిని పరిశీలించి,అధికారులకు సూచనలు జారీ చేశారు.ఎస్పీ తుహిన్‌ సిన్హా అనకాపల్లి జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలంలో గల వడ్డాది బ్రిడ్జి, విజయరామరాజుపేట వద్ద వరద నీటి ఉధృతిని పరిశీలించారు. అనకాపల్లి మండలంలోని వెంకుపాలెం వద్ద శారదానది ఉధృతిని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

నేలవాలిన విద్యుత్‌ స్తంభాలు..

జిల్లాలో 42 విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. ఈ కారణంగా మంగళవారం రాత్రంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్‌ సిగ్నల్స్‌ ఆగిపోవడంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థ నిలిచిపోయింది. విద్యుత్‌ అంతరాయంతో చాలా చోట్ల విద్యుత్‌ మోటార్లు పనిచేయకపోవడం నీటి సమస్య కూడా ఏర్పడింది.3 గృహాలు ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 85 చోట్ల తుఫాన్‌ షెల్టర్లు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ విలీన గ్రామాలైన ఎరుకువానిపాలెం,రాజుపాలెం, వల్లూరుతో సహా మరో రెండు శివారు గ్రామాలకు ఇక్కట్లు తప్పలేదు. అనకాపల్లి హైవే నుంచి ఈ గ్రామాలకు వెళ్లే రహదారిలోని రెండు వైపులా గల చెరువులు ఉప్పొంగడంతో రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మీదుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement