అచ్యుతాపురం రూరల్: తుపాను సమయంలో అచ్యుతాపురం సెజ్ పరిధిలోని ఉద్దపాలెం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రాజాన లక్ష్మి పాక ఇంట్లోకి కొండ చిలువ మంగళవారం రాత్రి వేళ చొరబడి 16 నాటు కోళ్లను మింగేసి అక్కడే ఉండిపోయింది. రాత్రి భోజనం చేసిన అనంతరం లక్ష్మి భర్త అప్పారావు నిద్రిస్తుండగా, ఏదో శబ్ధం వినిపించడంతో చేత్తో తడమగా మెత్తగా తగలడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో వారు రాత్రి పక్కింటికి వెళ్లి నిద్రించారు. తెల్లవారి పరిశీలించగా పాకలో కొండచిలువ కనిపించడంతో పాటు, ఇంట్లో పెంచుకుంటున్న 16 కోళ్లు మాయమైనట్టు గుర్తించారు. దీంతో రాజాన లక్ష్మి వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి అచ్యుతాపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు గాజువాకకు చెందిన స్నేక్ క్యాచర్‌ను రప్పించి కొండచిలువను బంధించారు. కొండ చిలువ వల్ల సుమారు రూ.25వేల విలువైన నాటు కోళ్లను కోల్పోయాయని రాజాన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.


